కనగల్ : రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో ఉందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం నల్లగొండ జిల్లా కనగల్ మండలం తేలకంటిగూడెం గ్రామానికి చెందిన రైతులు భైరగోని పెద్ద లింగయ్య, యాదయ్య పంట పొలాలను పరిశీలించారు. పొలంలోనే కూర్చొని పంటలు ఎండి బాధపడుతున్న వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం ఎండిన పంట పొలాల సమీపంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌ను సందర్శించి లాగ్‌బుక్‌ను పరిశీలించి విద్యుత్ సరఫరా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణానదిలో నీరు అందుబాటులో ఉన్నప్పటికీ పంటలు ఎందుకు ఎండిపోతున్నాయో ముఖ్యమంత్రి, మంత్రులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో సాగునీరు, విద్యుత్ అందడంతో పంటలు పండించుకున్నామని రైతులే చెబుతున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో 21 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన ఏర్పాట్లు చేశామని, 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించామన్నారు.
విద్యుత్ ఉత్పత్తి ఎందుకు నిలిపివేశారో
సమాధానం చెప్పాలి..
యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను ఎందుకు నిలిపివేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని జగదీష్‌రెడ్డి డిమాండ్ చేశారు. నీళ్లు, బొగ్గు లేదని చెబుతూ విద్యుత్, సాగునీటి సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్కలు పంటలు ఎండిన రైతులకు సమాధానం చెప్పాలని జగదీష్‌రెడ్డి డిమాండ్ చేశారు. రైతులకు సాగునీరు, 24 గంటల విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మాజీ ఎంపీపీ ఎస్కే కరీం పాషా, గోన రవీందర్ రావు, మాజీ జెడ్పీటీసీ తుమ్మల లింగస్వామి, పార్టీ నాయకులు అయితగోని యాదయ్య, దేప వెంకటరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ దోటి శ్రీనివాస్ పాల్గొన్నారు.
మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి
తేలకంటిగూడెంలో నీరులేక ఎండిన పంటల పరిశీలన


