సూర్యాపేట : జాతీయ రహదారికి సమాంతరంగా బుల్లెట్ రైలుతో పాటు రైల్వే కారిడార్ సాధించే వరకు ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని బుల్లెట్ ట్రైన్ సాధన అఖిలపక్ష సమితి కన్వీనర్ ప్రొఫెసర్ జానకిరెడ్డి అన్నారు. సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ సాధనకు అఖిలపక్షాల ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు ఆదివారం 38వ రోజు కొనసాగాయి. దీక్షల్లో తెలంగాణ జన సమితి అనుబంధ సంఘాల నాయకులు కూర్చున్నారు. ఈ సందర్బంగా జానకిరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బుల్లెట్ ట్రైన్ కారిడార్ అలైన్‌మెంట్‌ను కొంత మంది తమ స్వార్థం కోసం మార్చడం సరికాదన్నారు. దీని వల్ల సూర్యాపేటతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాకే తీరని అన్యాయం జరుగుతుందన్నారు. పాత అలైన్‌మెంట్‌ను కొనసాగించాలని డిమాండ్ చేశారు. దీక్షలో పార్టీ లీగల్ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు వీరేష్ నాయక్, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు గోపి, రైతు జన సమితి జిల్లా అధ్యక్షుడు కొల్లు కృష్ణారెడ్డి, గిరిజన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి సుమన్ నాయక్, జన సమితి జిల్లా అధ్యక్షుడు బొమ్మగాని వినయ్‌గౌడ్, యువజన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి నాగు నాయక్, తదితరులు కూర్చున్నారు. వారికి సూర్యాపేట బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తల్లమల్ల హస్సేన్, ఆడబిడ్డల వేదిక రాష్ట్ర కన్వీనర్ వెలుగు వనిత, సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి కోటపల్లి శివకుమార్, తదితరులు సంఘీభావం ప్రకటించారు.


