చివ్వెంల(సూర్యాపేట) : సూర్యాపేట జిల్లా పోర్టు పోలియో జడ్జిగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇ.వి.వేణుగోపాల్‌ను నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇక్కడ పోర్టు ఫోలియో జడ్జిగా విధులు నిర్వహిస్తున్న జస్టిస్ టి.మాధవీదేవి కరీంనగర్ జిల్లాకు బదిలీపై వెళ్లారు. ఆమె స్థానంలో వేణుగోపాలను నియమించింది.
ఇంగ్లిష్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా కమిటీ ఎన్నిక
సూర్యాపేట : ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచర్స్ జిల్లా కౌన్సిల్ సమావేశాన్ని సోమవారం సూర్యాపేట పట్టణంలోని సిటీ హైస్కూల్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బి.రామ్‌సుధీర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా పబ్బతి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులుగా ఎస్‌కే. షైనాజ్, సీహెచ్.వెంకయ్య, కార్యదర్శులుగా కె.రామకృష్ణ, ఎస్‌కె.ఖాశీం, కేవీ.సత్యనారాయణ, జె.జాన్‌విల్సన్, జానకిరాములు, మధు, ట్రెజరర్‌గా ఎం.సైదులు, మీడియా ఇన్‌చార్జిగా వర్ధెల్లి కృష్ణ, రాష్ట్ర కౌన్సిలర్‌గా డి.రవికుమార్, టి.విజయ్ కుమార్ స్క్రీన్ బి.శ్రీనివాసచారి, గురు చరణ్, నాగరాజు ఎన్నికయ్యారు.
బుల్లెట్ రైలు సాధనకు
ఐక్యంగా ఉద్యమిద్దాం
సూర్యాపేట : సూర్యాపేటకు బుల్లెట్ రైలు సాధనకు అఖిలపక్షాల ఆధ్వర్యంలో ఐక్యంగా ఉద్యమిద్దామని వస్త్ర వ్యాపారుల సంఘం జిల్లా అధ్యక్షుడు గండూరి శంకర్, కుమ్మరి సంఘం అధ్యక్షుడు సరిగంటి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. పేటకు బుల్లెట్ రైలు సాధన లక్ష్యంగా రైతు బజార్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షల 39వ రోజు కార్యక్రమంలో కుమ్మరి సంఘం నాయకులు కూర్చున్న సందర్భంగా వారు మాట్లాడారు. దీక్షలో సంఘం నాయకులు పాల్గొన్నారు.
ఖమ్మంలో డిప్యుటేషన్ రద్దు, నల్లగొండకు కేటాయింపు
ఖమ్మం సహకారనగర్ : ఖమ్మం జిల్లా పౌరసరఫరాల శాఖలో డిప్యూటీ తహసీల్దార్‌గా విధులు నిర్వర్తిస్తున్న జె.నాగలక్ష్మి డిప్యుటేషన్‌ను రద్దుచేస్తూ ఉన్నతాధికారులు సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. సూర్యాపేట జిల్లాలో డీటీగా జె.నాగలక్ష్మి పోస్టింగ్ ఉండగా, ఇకపై నల్లగొండ జిల్లా పౌర సరఫరాల అధికారి కార్యాలయానికి డిప్యుటేషన్ కేటాయించారు. ఈమేరకు ఆమెను ఖమ్మంలో వెంటనే రిలీవ్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
శివయ్యకు పుష్పార్చన
మేళ్లచెరువు : మండలకేంద్రంలోని శ్రీ ఇష్టకామేశ్వరీ సమేత శ్రీ స్వయంభు శంభులింగేశ్వర స్వామి దేవాయలంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శివలింగాన్ని పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి గణపతిపూజ, పుణ్యాహవచనం, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సహస్రనామార్చన, మహాలింగార్చన, పుష్పార్చన అనంతరం గోపూజ నిర్వహించారు.
ఎడమకాల్వకు నీటి నిలిపివేత
నాగార్జునసాగర్ : సాగర్ ఎడమకాల్వకు అధికారులు సోమవారం నీటిని నిలిపి వేశారు. వర్షాబావ పరిస్థితుల దృష్ట్యా ఆయకట్టు ప్రాంత రైతులు, ప్రజలు, ప్రజాప్రతినిధుల కోరిక మేరకు తాగునీటి అవసరాలకుగాను చెరువులు నింపుకునేందుకు ఆగస్టు 28 నుంచి ఈ నెల 21వ తేదీ వరకు నీటిని విడుదల చేశారు. గడిచిన 25 రోజుల్లో 13.6 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.


