నిమజ్జనానికి సన్నాహాలు | - | Sakshi
Sakshi News home page

నిమజ్జనానికి సన్నాహాలు

Sep 22 2026 5:28 AM | Updated on Sep 22 2026 5:28 AM

సూర్యాపేటటౌన్‌ : జిల్లా వ్యాప్తంగా బుధవారం నిర్వహించనున్న నిమజ్జన శోభాయాత్రకు పోలీస్‌ శాఖ భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా 1,200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలోని కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి ప్రధాన మార్గాలు, నిమజ్జన ప్రాంతాలను సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షించనున్నారు.

3,150 గణేష్‌ విగ్రహాలు

జిల్లా వ్యాప్తంగా 3,150 గణేష్‌ విగ్రహాలను భక్తులు నెలకొల్పారు. ఉత్సవ కమిటీలు బుధవారం ఉదయమే నిమజ్జన శోభాయాత్రలను ప్రారంభించి వీలైనంత త్వరగా పూర్తిచేసుకోవాలని, బ్యాండ్‌, మేళం, సౌండ్‌ సిస్టమ్‌ అందుబాటులో లేవనే కారణంతో నిమజ్జనాలను వాయిదా వేయవద్దని పోలీసులు సూచిస్తున్నారు. నిమజ్జన శోభాయాత్రల్లో డీజేలకు అనుమతి లేదని జిల్లా పోలీస్‌ శాఖ స్పష్టం చేసింది. అధిక శబ్దాలతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సంప్రదాయ సంగీతం, సాంస్కృతిక కార్యక్రమాలతో ఉత్సవాలను నిర్వహించుకోవాలని సూ చించారు. నిబంధనలు ఉల్లంఘించి డీజేలు వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుని వాటిని సీజ్‌ చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ప్రమాదాల నివారణపై ప్రత్యేక నిఘా

ఎత్తైన విగ్రహాలను తరలించే సమయంలో విద్యుత్‌ తీగల విషయంలో అప్రమత్తంగా ఉండేలా పోలీస్‌ శాఖ చర్యలు తీసుకుంటోంది. వాహనాలపై పిల్లలను ఎక్కించకుండా, మద్యం సేవించి వాహనాలు నడపకుండా ఇప్పటికే ఉత్సవ కమిటీలకు ఆదేశాలు జారీ చేసింది. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు చేపట్టి నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోనున్నారు. టపాకాయలు కాల్చకుండా, ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా శోభాయాత్రను ఒకే వరుసలో నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది.

అత్యవసర సేవలకు 112 నంబర్‌

జిల్లాలో ఎక్కడైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే 10 నిమిషాల్లో పోలీస్‌ సేవలు అందేలా పెట్రో కార్లు, బ్లూకోట్స్‌, హైవే పెట్రోలింగ్‌, బీట్‌ సిస్టమ్‌ను సిద్ధం చేశారు. అత్యవసర సమయంలో పోలీస్‌ సహాయం పొందేందుకు ప్రజలు 112 నంబర్‌కు ఫోన్‌ చేసి సంప్రదించాలి. నీటి వనరులు తక్కువగా ఉన్న నేపథ్యంలో చెరువులు, నదులు, కుంటలను కాలుష్యానికి గురిచేయకుండా జాగ్రత్తలు పాటించాలని పోలీస్‌ శాఖ సూచిస్తోంది.

నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు

సూర్యాపేటలోని సద్దుల చెరువు, రత్నాపురం వద్ద మూసీ రివర్‌, కోదాడ పెద్ద చెరువు, మట్టపల్లి బ్రిడ్జి, పాలకవీడు మండలం మహంకాళిగూడెం వద్ద కృష్ణానది, నేరేడుచర్ల పరిధిలోని చిల్లేపల్లి మూసీ బ్రిడ్జి వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్‌ పికెట్లు, ఫ్లడ్‌లైట్లు, భారీ క్రేన్లు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు.

గణేష్‌ నిమజ్జన ప్రాంతాల్లో

క్రేన్లు, గజ ఈతగాళ్లు సిద్ధం

1,200 మంది పోలీసులతో

భారీ బందోబస్తు

సీసీ కెమెరాలతో పర్యవేక్షణ

డీజేలకు అనుమతి లేదంటున్న పోలీస్‌ శాఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement