జాతీయ రహదారిపై ప్రమాదాలకు ప్రధాన కారణాలివే..
అతివేగం.. అడ్డగోలుగా పార్కింగ్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి ప్రయాణికుల పాలిట మృత్యుమార్గంగా మారుతోంది. అతివేగం, డ్రైవర్ల నిర్లక్ష్యం, రోడ్డు పక్కన ప్రమాదకరంగా భారీ వాహనాలు నిలిపివేయడం, వీటికి తోడు హైవే పెట్రోలింగ్ వ్యవస్థ పర్యవేక్షణ లోపాలు వెరసి నిత్యం ఏదో ఒకచోట ప్రమాదం జరుగుతూనే ఉంది. తాజాగా బుధవారం తెల్లవారుజామున కోదాడ మండలం దోరకుంట వద్ద జరిగిన ఘోర ప్రమాదం ఈ పరిస్థితికి అద్దం పడుతోంది.
ఉమ్మడి జిల్లా పరిధిలో ఏడాది కాలంలో..
ఈ ఏడాది కాలంలో ఉమ్మడి జిల్లా పరిధిలోని హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి పొడవునా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 200 మందికిపైగా మరణించారు. ఈ మూడు నెలల్లోనే 20 మందికిపైగా మృతిచెందారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూఫ్రాన్‌పేట నుంచి మొదలుకొని కోదాడ వరకు హైవేపై ప్రమాదాలు నిత్యకృత్యం అయ్యాయి. తూఫ్రాన్‌పేట, మల్కాపురం జంక్షన్, బొర్రోళ్లగూడెం స్టేజీ, కై తాపురం స్టేజీ, ధర్మోజిగూడెం స్టేజీ, దివీస్ పరిశ్రమ ముందు, పంతంగి గ్రామ స్టేజీ, ఆరెగూడెం క్రాస్‌రోడ్డు వరకు ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. అలాగే నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు, నార్కట్‌పల్లి మండలం ఏపీ లింగోటం, సూర్యాపేట జిల్లా దురాజ్‌పల్లి, ఖాసీంపేట, వల్లభాపురం, గుంజలూరు, మునగాల, కోదాడ ప్రాంతాల్లో తరచుగా ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. గతేడాది జూలై 26న చౌటుప్పల్ మండల పరిధిలోని కై తాపురం స్టేజీ వద్ద జరిగిన ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు పోలీసు అధికారులు ప్రాణాలు కోల్పోయారు.
ఇష్టారీతిన పార్కింగ్‌తో సమస్యలు
హైవే వెంట వాహనాలు ఇష్టానుసారంగా పార్కింగ్ చేస్తున్నారు. ఎలాంటి హెచ్చరికలు, సూచికలు ఏర్పాటు చేయకుండా నిలుపుతున్నారు. దీంతో రాత్రి సమయాల్లో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వెనుక నుంచి వచ్చే వాహనదారులు అయోమయానికి గురై ప్రమాదాల బారిన పడుతున్నారు. వాహనం ఆగిపోయినా, డ్రైవర్ విశ్రాంతి తీసుకుంటున్నా.. వెనుక నుంచి వచ్చే వాహనాలకు ముందస్తు హెచ్చరికలు, తగిన భద్రతా ఏర్పాట్లు ఉండాల్సి ఉంటుంది. ఇవి సక్రమంగా లేకపోతే చిన్నపాటి పొరపాటు కూడా ప్రాణాంతకంగా మారుతోంది.
ఏటా వందల మంది మృత్యువాత
హైదరాబాద్–విజయవాడ హైవేపై ఒక్క చౌటుప్పల్‌ప్పల్ మండల పరిధిలోని 28 కిలోమీటర్ల హైవే పరిధిలోనే గతేడాది 129మంది చనిపోయారు. ఈ ఏడాది 8 నెలల్లోనే 156 మంది మరణించారు. నార్కట్‌పల్లి మండలంలో 17 మంది, చిట్యాల మండలంలో ఏడుగురు మృతిచెందారు. మొత్తంగా చౌటుప్పల్ నుంచి కోదాడ వరకు హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదాల్లో గతేడాది 200 మందికిపైగా, ఈ ఏడాది ఇప్పటివరకు మరో 200 మందికిపైగా మరణించారు. ఇతర జాతీయ, రాష్ట్ర రహదారుల్లోనూ పెద్ద మొత్తంలో మరణాలు సంభవించాయి.
రహదారులపై డేంజర్ స్పాట్లు–జోన్ పేజీలో
ఫ ఎక్కడపడితే అక్కడ లారీల నిలుపుదల
ఫ పట్టించుకోని హైవే పెట్రోలింగ్
ఫ గాల్లో కలుస్తున్న ప్రాణాలు
ఫ గత ఏడాది కాలంలో 200 మందికిపైగా బలి
ఫ ఈ ఎనిమిది నెలల్లోనే అంతకంటే ఎక్కువ మంది మృత్యువాత


