సూర్యాపేట : ఇన్నాళ్లు రాజకీయ అవసరాల కోసం పట్టణాలు, సొంతూర్లలో ఓటు కలిగిన వారంతా ఇప్పుడు స్వగ్రామంలోనే ఓటు హక్కు ఉంచుకునేలా చూసుకుంటున్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా డబుల్ ఓట్లను వదులుకోవాల్సిందేనని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇందులో వలస వెళ్లిన ప్రాంతాలు, పట్టణంలో ఓటర్లు తమ ఓటును తొలగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే జిల్లాలోని సూర్యాపేట, కోదాడ వంటి మున్సిపాలిటీల్లో ఓటర్లు తగ్గుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 13,016 మంది ఓటర్లకు రెండు చోట్ల ఓట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
96,307 ఓట్లు తొలగింపే..
జిల్లాలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన సర్‌లో భాగంగా దాదాపు 96,307 ఓట్లు తొలగింపునకు గురి కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో అత్యధికంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్లే 48,310 మంది ఉన్నారు. తర్వాత మృతిచెందిన ఓటర్లు 26,059 మంది, డబుల్ ఓట్లు కలిగిన వారు మరో 13,016 మంది ఉన్నారు. ఇంతకాలం స్వగ్రామంతోపాటు సమీప పట్టణాలైన సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్, తిరుమలగిరి వంటి మున్సిపాలిటీల్లోనూ ఈ డబుల్ ఓట్లు కలిగి ఉన్నారు. రాజకీయపరంగా వచ్చే అవకాశాల కోసం వీరంతా వీటిని కొనసాగిస్తూ వచ్చారు. ప్రస్తుతం ఏదో ఒకదాన్ని మాత్రమే ఎంచుకోవాల్సి రావడంతో ఈ డబుల్ ఓటర్లంతా ఆస్తులు, వ్యవసాయ భూములు ఉన్న స్వగ్రామాలనే ఎంపిక చేసుకుంటున్నారు.
వలస ఓటర్లు ఏటో..!
జిల్లాలో తొలగింపునకు గురయ్యే ఓటర్లలో వలసలకు వెళ్లిన వారే 50 శాతం మేర ఉన్నారు. అయితే ఈ వలస ఓటర్లు జిల్లాలోని సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల పరిధిలో సమానంగానే ఉన్నారు. ఈ నేపధ్యంలో ముసాయిదా జాబితా వస్తే గానీ ఈ వలస ఓటర్ల జాబితాలో ఉన్నవారు అధికంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారా..? లేదంటే పట్టణ ప్రాంతాల్లో ఉన్నారో తేలాల్సి ఉంది. ఉపాధి నిమిత్తం 20 ఏళ్లకు పైబడి పట్టణ ప్రాంతాలకు వచ్చిన వారంతా శాశ్వతంగా ఇక్కడే ఉంటున్నా.. వారికి సంబంధించి ఓట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్నాయి. ఈ సర్ ప్రక్రియలో వీరంతా పట్టణ ప్రాంతాల్లోనే ఓటు హక్కును పొందేలా.. వలస ఓటర్లుగా మారారా..? అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ తమకు లోకల్‌గానే ఓటు హక్కు ఉండాలని ఓటర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఫ పట్టణ ప్రాంతాల్లో ఓటు హక్కును
వదులుకుంటున్న ఎస్‌ఐఆర్‌లు
ఫ డబుల్ ఓట్లుంటే ఒక్కచోటే ఉంచుకోవాలన్న ఎన్నికల సంఘం
ఫ జిల్లాలో 96,307 ఓట్లు
తొలగించే అవకాశం


