వివాహిత దారుణ హత్య | - | Sakshi
Sakshi News home page

వివాహిత దారుణ హత్య

Aug 17 2026 7:23 AM | Updated on Aug 17 2026 7:23 AM

చౌటుప్పల్‌ : తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తోందన్న కక్షతో ఓ వివాహితను ఆమె ప్రియుడు దారుణంగా హత్య చేశాడు. ఆధారాలు దొరకకుండా మృతదేహానికి నిప్పంటించి పరారయ్యాడు. దారుణం జరిగిన 20 రోజుల తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. చౌటుప్పల్‌ సీఐ జి. మన్మథకుమార్‌ శనివారం ఈ కేసు వివరాలను వెల్లడించారు. చౌటుప్పల్‌ మండలం పెద్దకొండూరు గ్రామానికి చెందిన షేక్‌ సలీమా(37) భర్త చనిపోయాడు. ఆమెకు వివాహమైన ఒక కుమార్తె ఉంది. బండరాళ్లు కొట్టే పని చేసుకుంటూ సలీమా జీవనం సాగిస్తోంది. కుల వృత్తిలో భాగంగా ఆమె ఏడాది క్రితం హనుమకొండ జిల్లా ధర్మసాగర్‌ మండలం క్యాతంపల్లి గ్రామానికి చెందిన సయ్యద్‌ బషీర్‌ వద్దకు పనికి వెళ్లింది. ఆ సమయంలో వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడి, అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని బషీర్‌ను సలీమా ఒత్తిడి చేయడం మొదలుపెట్టింది. అయితే అప్పటికే బషీర్‌కు వివాహమై భార్య, పిల్లలు ఉండటంతో సలీమాను పెళ్లి చేసుకునేందుకు అతడు నిరాకరించాడు.

పథకం ప్రకారమే హత్య..

సలీమా తీరుతో విసిగిపోయిన బషీర్‌.. ఆమెను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాడు. ఈ మేరకు గత నెల 25న ఉదయం సలీమాకు ఫోన్‌ చేసి భువనగిరి వస్తే తాను బైక్‌పై వచ్చి తీసుకెళ్తానని నమ్మబలికాడు. బషీర్‌ మాటలు నమ్మిన సలీమా.. పెద్దకొండూరు వద్ద బస్సు ఎక్కి భువనగిరి ఆర్టీసీ బస్‌స్టేషన్‌కు చేరుకుంది. అక్కడికి వచ్చిన బషీర్‌ ఆమెను బైక్‌పై ఎక్కించుకొని తుర్కపల్లి మండలం వెంకటాపురం రిజర్వ్‌ ఫారెస్ట్‌ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ సలీమా మళ్లీ పెళ్లి ప్రస్తావన తెచ్చింది. తాను పెళ్లి చేసుకోనని బషీర్‌ తెగేసి చెప్పడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కోపంతో రగిలిపోయిన బషీర్‌ పక్కనే ఉన్న కర్రతో సలీమా తలపై బలంగా కొట్టి హత్య చేశాడు. అనంతరం అక్కడే ఉన్న కర్రలను సలీమా మృతదేహంపై వేసి నిప్పంటించి వెళ్లిపోయాడు.

తల్లి ఫిర్యాదుతో కదిలిన డొంక..

తన కుమార్తె కనిపించడం లేదంటూ మృతురాలి తల్లి సైదాభి అదే రోజున చౌటుప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక, ఇతర ఆధారాల సాయంతో సయ్యద్‌ బషీర్‌ను అనుమానితుడిగా గుర్తించి శనివారం అతడి స్వగ్రామం క్యాతంపల్లిలో అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితుడు జరిగిన విషయాన్ని చెప్పి చేసిన నేరాన్ని అంగీకరించాడు. నిందితుడిని అరెస్ట్‌ చేసి నల్లగొండ జైలుకు రిమాండ్‌కు తరలించినట్లు సీఐ మన్మథకుమార్‌ తెలిపారు.

ఫ తలపై కర్రతో బాది చంపి,

దహనం చేసిన ప్రియుడు

ఫ 20 రోజుల తర్వాత

వెలుగులోకి వచ్చిన ఘటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement