జి.సిగడాం(పొందూరు): పొందూరులోని చేనేత శిక్షణ కేంద్రం ప్రాంగణంలో రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ నిర్మాణ పనులకు ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ బుధవారం భూమిపూజ చేశారు. పల్లె పండుగ పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ కిరణ్కుమార్, ఎంపీడీఓ వాసుదేవరావు, ఏఎంసీ చైర్‌పర్సన్ చిగిలిపల్లి పద్మావతి తదితరులు పాల్గొన్నారు.
నేలకొరిగిన తోటలు
పరిశీలన
నరసన్నపేట: గాలులు, వర్షాలకు నష్టం కలిగిన అరటి, కొబ్బరి, పూల తోటలను హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ పెద్దపేటకు చెందిన ప్రధాన శాస్త్రవేత్త నరసింహమూర్తి, స్థానిక ఉద్యానవన అధికారి కె.సునీతలు బుధవారం నరసన్నపేట, పోలాకి మండలాల్లో పర్యటించి పరిశీలించారు. కోమర్తి, మబగాం, కొల్లివలస తదితర గ్రామాల్లో రైతులకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వానికి ఇప్పటికే నివేదిక పంపామని అధికారులు వివరించారు. ప్రస్తుతం సస్యరక్షణ చర్యలు పాటించాలన్నారు.
కార్తీక మాసోత్సవాల
ఏర్పాట్లకు బహిరంగ వేలం
టెక్కలి: మండలంలోని రావివలస ఎండల మల్లిఖార్జునస్వామి దేవస్థానంలో కార్తీక మాసంలో నిర్వహించనున్న ఉత్సవాలకు సంబంధించి వివిధ ఏర్పాట్లుకు బుధవారం బహిరంగ వేలంపాట నిర్వహించినట్లు ఈవో జి.గురునాథరావు ఒక ప్రకటనలో తెలిపారు. క్యూలైన్ ఏర్పాట్లుకు సనపల రాజు రూ.1,45,000లకు వేలంపాట పాడినట్లు వెల్లడించారు. విద్యుత్ అలంకరణకు రూ.1,20,000లకు, షామియానాలు, పెండాల్స్‌కు రూ.3,30,000లకు నర్తు గణపతి వేలంపాట పాడినట్లు తెలిపారు. అలాగే తల నీలాలు వసూళ్లు చేసుకునే లైసెన్స్ హక్కుకు గత సంవత్సరం రూ.2,20,000లకు వేలంపాట ఉండగా, ఇప్పుడు రూ,3,70,000లకు గిరిజా శంకర్ అనే వ్యక్తి వేలంపాట పాడినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో గ్రూప్ దేవస్థానం కార్యనిర్వాహణాధికారి టి.పి.మనస్వి పాల్గొన్నారు.
గాలింపు ముమ్మరం
శ్రీకాకుళం క్రైమ్: జిల్లాకేంద్రంలోని డే అండ్ నైట్ సమీప నాగావళి వంతెన పైనుంచి ఇటీవల దూకి గల్లంతైనవారి కోసం ఫైర్ రెస్క్యూ బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. గతేడాది ఇదే వంతెనపై నుంచి భార్య చనిపోయిందని మనస్థాపానికి గురైన ఆటో డ్రైవర్ దువ్వు మోహనరావు గతనెల 25 అర్ధరాత్రి నదిలోకి దూకేసి గల్లంతయ్యాడు. అక్కడికి 3 రోజుల్లో అనారోగ్యానికి గురైన వృద్ధురాలు కొమ్మనాపల్లి భారతి ఇదే డే అండ్ నైట్ వంతెనపై నుంచి దూకేసింది. దీంతో వీరికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
సర్‌తో ప్రజాస్వామ్యం అపహాస్యం
శ్రీకాకుళం పాతబస్టాండ్: సర్ పేరుతో అక్రమంగా ఓట్లను తొలగించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు డీసీసీ అధ్యక్షుడు సనపల అన్నాజీరావు ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. అనంతరం వినతిపత్రాన్ని ఆర్డీవో కె.సాయి ప్రత్యూషకి అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీమంత్రి కిల్లి కృపారాణి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 13.4 కోట్ల ఓట్లను తొలగించి బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని విమర్శించారు. దీనికి బాధ్యత వహిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ కిల్లి రామ్మోహన్‌రావు, డాక్టర్ బీవీ శ్యామరావు, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు రెళ్ల సురేష్, డీసీసీ మాజీ అధ్యక్షుడు అంబటి కృష్ణారావు, ఉపాధ్యక్షుడు దేవేళ్ల గోవింద మల్లిబాబు, కరిమజ్జి మల్లేశ్వరరావు, బచ్చు కృష్ణవేణి పాల్గొన్నారు.


