శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, అక్రమ కేసులు, సస్పెన్షన్లను వెంటనే ఎత్తివేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.తేజేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు, జిల్లా ఉపాధ్యక్షులు కె.నాగమణి డిమాండ్ చేశారు. స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాన్ని ఖండిస్తూ అక్రమ కేసులు, సస్పెన్షన్లను వెంటనే ఎత్తివేయాలని కోరుతూ సీఐటీ యూ ఆధ్వర్యంలో బుధవారం శ్రీకాకుళంలో అంబేడ్కర్ కూడలి వద్ద నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులు నిర్వహించిన ఛలో విజయవాడ కార్యక్రమాన్ని భగ్నం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం శతవిధాల ప్రయత్నించిందని, ఎక్కడికక్కడ అరెస్టులు చేయించిందని, ముందుగానే అనుమతి కోరినా ఇవ్వకపోవడం దారుణమన్నారు. నిరసన కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు మణికొండ ఆదినారాయణమూర్తి, బండారు మురళి, ఎం.గోవర్దనరావు, ఆల్ పెన్షనర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు బొడ్డేపల్లి జనార్దనరావు, ఐద్వా నగర కార్యదర్శి టి.ప్రవీణ, గ్రామ వార్డు సచివాలయం వైద్య ఆరోగ్య కార్యదర్శులు యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్.వెంకటలక్ష్మి, సి.హెచ్.రాధిక, వై.ప్రభావతి పాల్గొన్నారు.
ప్రాణం తీసిన మద్యం మత్తు
శ్రీకాకుళం క్రైమ్ : వ్యసనాలకు బానిసైన వారిని ఆ వ్యసనాలే ఎప్పుడో ఒకప్పుడు బలి తీసుకుంటాయనడానికి తాజా నిదర్శనం శ్రీకాకుళం ఓ వృద్ధుడు నిద్రలోనే కాలిపోయిన ఘటన. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాకేంద్రంలోని వాంబేకాలనీ మూడో బ్లాక్‌లో పాలిశెట్టి నర్సింహమూర్తి (65) అలియాస్ రమణ ఒంటరిగా నివాసముంటున్నాడు. ఇతని తండ్రి గతంలో పోలీస్ శాఖలో పనిచేశారని, తల్లిదండ్రులతో కలసి తుమ్మావీధిలో వుండేవాడని తెలిసింది. సొంతగ్రామం సరుబుజ్జిలి మండలం రొట్టవలస. వివాహం కాకపోవడం, తల్లిదండ్రులు చనిపోవడంతో మనస్థాపానికి గురైన నర్సింహమూర్తి కొన్నాళ్లుగా భిక్షాటన చేస్తున్నట్లు సమాచారం. బుధవారం వేకువజామున మద్యం మత్తులో తాగి పడేసిన సిగరెట్టు పీక తాను పడుకునే బొంతకు అంటుకోవడంతో నర్సింహమూర్తి సజీవ దహనమయ్యాడు. అతనితో పాటు ఇంట్లో వస్తువులకు మంటలు అంటుకున్నాట్లు ఫైర్ విభాగం, పోలీసులు భావిస్తున్నారు. వేకువఝామున మంటలు కనిపించడంతో అప్రమత్తమైన మొదటి అంతస్థులోని స్థానికులు చూసి ఫైర్ సిబ్బందికి, ఒకటో పట్టణ పోలీసులకు సమాచారమందించారు. వెంటనే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. ఒకటో పట్టణ ఎస్‌ఐ ఎం.హరికృష్ణ సిబ్బందితో పాటు వెళ్లి స్థానికులను వివరాలడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనలో వరండాలో పార్కింగ్ చేసిన ద్విచక్రవాహనం సైతం మంటలకు దగ్ధమైనట్లు గుర్తించారు.
రాష్ట్రపతి ఉత్తర్వుల
అమలు నిలిపివేయాలి
అరసవల్లి : రాష్ట్రపతి ఉత్తర్వులు–2025 పేరిట సెటిల్డ్ అయిన ఉద్యోగుల సర్వీసులను అన్‌సెటిల్ చేసే ప్రక్రియను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా సంఘ సర్వసభ్య సమావేశానికి హాజరై అనంతరం విలేకరులతో మాట్లాడారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణను కారణంగా చూపి 95 శాతం స్థానిక రిజర్వేషన్‌తో కొత్త జోనల్ వ్యవస్థను తీసుకురావడం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించారు. తెలంగాణలో 10 జిల్లాలను 30 చేసి అమలు చేసిన విధానాన్ని ఏపీలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేసి అదే విధానాన్ని కేంద్రానికి పంపించారని ఆరోపించారు. చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో 12 మంది ఐఎఎస్‌లతో కమిటి వేశామని చెప్పినా...ఆ జీవో పబ్లిక్ డొమైన్‌లో లేదని గుర్తుచేశారు. ఈ నెల 12 నుంచి ప్రతి జిల్లాలో మేధావులు, నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు, న్యాయవాదులు, జర్నలిస్టులతో కలిసి చర్చావేదికలను నిర్వహిస్తామని ప్రకటించారు. సమావేశంలో ఏపీజీఈఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి కోసపురెడ్డి శ్రీనివాస్, జిల్లా సంఘ ప్రధాన కార్యదర్శి పైడి నాగేశ్వరరావు, ఆర్గనైజింగ్ సెక్రటరి కింజరాపు నరిసింహమూర్తి తదితరులున్నారు.


