‘ప్రసాద్‌’ పోయే.. ‘స్వదేశ్‌ దర్శన్‌’ వచ్చే..! | - | Sakshi
Sakshi News home page

‘ప్రసాద్‌’ పోయే.. ‘స్వదేశ్‌ దర్శన్‌’ వచ్చే..!

Oct 1 2026 12:53 AM | Updated on Oct 1 2026 12:53 AM

● ఆదిత్యాలయానికి స్వదేశ్‌ దర్శన్‌ కింద నిధులు మంజూరు

● రూ.100 కోట్లు అంటూ ప్రచారాలు చేసి రూ.55.74 కోట్లతో సరిపెట్టిన వైనం

● కింజరాపు ప్రచారాలపై పెదవి

విరుస్తున్న స్థానికులు

అరసవల్లి: ‘ప్రసాద్‌’ స్కీం తెచ్చేస్తున్నాం..రూ.100 కోట్లు మన అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయ అభివృద్ధి కోసం నిధులు తెచ్చేస్తున్నాం’ అంటూ కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడులు వరుస పర్యటనలు, ప్రచార ప్రకటనలతో హోరెత్తించారు. రెండేళ్లుగా ఇదే పాట పాడుతూ.. అరసవల్లికి ‘ప్రసాద్‌’ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించేస్తుందంటూ ఊదరగొట్టారు. తీరా చూస్తే ‘ప్రసాద్‌’ పథకం ఇకరాదంటూ స్వదేశ్‌ దర్శన్‌ 2.0 పేరిట పర్యాటకశాఖ ఆధ్వర్యంలో కేంద్రప్రభుత్వ పథకానికి అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి వారి ఆలయాన్ని ఎంపిక చేయించారు. ఈ పథకం కింద రూ. 55.74 కోట్ల నిధులను మంజూరు చేయించినట్లుగా కేంద్ర పర్యాటకశాఖ మంత్రి గజేంద్ర షకావత్‌ నుంచి ప్రకటన వచ్చినట్లుగా అధికారులతో పాటు మంత్రులు ప్రకటించారు. రూ.100 కోట్ల ప్రసాద్‌ పథకం అంటూ ఊదరగొట్టి ఇప్పుడు రూ.55 కోట్లతో స్వదేశ్‌ అంటూ మాట తప్పారేంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రసాద్‌ స్కీం పేరిట ఆలయం ముందున్న పదుల సంఖ్యలో వ్యాపారుల కడుపు కొట్టి వారి దుకాణాలతో పాటు దాతలు నిర్మించిన అన్నదాన మండపం, టీటీడీ కల్యాణ మండపం, వసతి గదులను కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే కూల్చేసిన సంగతి తెలిసిందే.

పలు నిర్మాణాలకు కేటాయింపు..

స్వదేశ్‌ దర్శన్‌ నిధులతో సన్‌ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ రూ.31.96 కోట్లుతోనూ, రెస్టారెంట్‌ బ్లాక్‌కు రూ. 1.31 కోట్లు, షాపింగ్‌ ఏరియాకు రూ.1.43 కోట్లు కేటాయించారు. మిగిలిన నిర్మాణాలను కూడా ప్రతిపాదించారు. వీటికి ఇప్పటివరకు స్థలాలను గుర్తించలేకపోవడం గమనార్హం. ఇటీవల ప్రైవేటు యజమానుల నుంచి భూ బదలాయింపు పథకం కింద సేకరించిన 1.22 ఎకరాల స్థలంను వీటికి వినియోగించాలని కలెక్టర్‌ భావించినట్లు సమాచారం. ఈ భూములనే ఆలయ భూములుగా రిజిస్టర్‌ చేసిన అనంతరం ఎన్‌వోసీ జారీ చేయించాలని ఆలయ ఈవోపై ఇటీవల ఒత్తిడి తెచ్చిన సంగతిని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన సంగతి విదితమే. ఈ స్థలాల వివాదం ఇంకా కొలిక్కి రాకముందే తాజా అంశం వెలుగులోకి రావడం చర్చనీయాంశమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement