శ్రీకాకుళం కల్చరల్:
విద్యార్థులు కేవలం మార్కుల రేసులోనే పరిగెత్తకుండా, ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేయాలని జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె.చెన్నకేశవరావు పిలుపునిచ్చారు. భారత్ వికాస్ పరిషత్ శ్రీకాకుళం శాఖ ఆధ్వర్యంలో స్థానిక జీటీ రోడ్డులోని చంద్రమహల్ ఎదురుగా ఉన్న సంస్థ కార్యాలయంలో ‘భారత్ కో జానో’ క్విజ్ పోటీలు–2026 బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్విజ్ పోటీలు విద్యార్థుల్లో సరికొత్త ఆసక్తిని, విజ్ఞానాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. విద్యార్థులు పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా సమాజంలో తమ బాధ్యతలను గుర్తు చేసుకోవాలని, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన గురుతర బాధ్యత నేటితరంపై ఉందన్నారు. పోటీల్లో పాల్గొనడం వల్ల విద్యార్థులకు భవిష్యత్‌లో ఉండే అనేక అవకాశాలపై స్పష్టమైన అవగాహన ఏర్పడుతుందన్నారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులు విజయవాడలో జరగనున్న అంతర్ జిల్లాల క్విజ్ పోటీలకు ఎంపికయ్యారని నిర్వాహకులు తెలిపారు. సంస్థ అధ్యక్షుడు కెప్టెన్ బుర్రా ఆదినారాయణ శాస్త్రి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా సంఘచాలక్ పి.వి.రమణమూర్తి, ఎంఈవో రెడ్డి సీతంనాయుడు, గురజాడ సంస్థల డైరెక్టర్ సంయుక్త, శార్వాణి స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.రేఖ, విశ్రాంత ప్రిన్సిపాల్ కోసూరు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.


