సంతబొమ్మాళి: కాకరాపల్లి థర్మల్ ప్లాంట్‌కు సంబంధించి జీఓ 1108ను రద్దు చేసి ఆ భూములను మత్స్యకార సొసైటీకి లీజుకివ్వాలనీ థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ డిమాండ్ చేసింది. కాకరాపల్లి థర్మల్ ప్లాంట్ వ్యతిరేకంగా వడ్డితాండ్రలో చేపడుతున్న రిలే నిరహార దీక్ష శిబిరం ఆదివారంతో 17వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా దీక్ష శిబిరాన్ని సందర్శించి పలువురు మాట్లాడారు. మత్స్యకారులు, థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులపై అక్రమంగా బనాయించిన కేసులు తక్షణమే రద్దు చేయాలన్నారు. కాకరాపల్లి తంపర భూముల్లో ప్రైవేటు వ్యక్తులు అక్రమంగా ఏర్పాటు చేసుకున్న చేపల చెరువులను వెంటనే రద్దు చేయాలని కోరారు. కార్యక్రమంలో పోరాట కమిటీ అధ్యక్షుడు, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కోశాధికారి నంబారి వెంకటరావు, అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నశెట్టి రాజశేఖర్, రైతులు సంఘం నాయకులు కోత మధుసూధనరావు, మత్స్యకార సొసైటీ నాయకులు పద్మనాభం, గన్ను, హన్నురావు, ఖైత్రో, కేశవ, అడివమ్మా, హేమలత, దమయంతి, సమావేశ అధ్యక్షుడు ఎస్.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థికి విద్యుత్ షాక్
నరసన్నపేట: నరసన్నపేటలో ఓ ప్రవేటు డిగ్రీ కళాశాల విద్యార్థి లండ లికిందర్ ఆదివారం తాను ఉంటున్న వసతి గృహంలో విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. గమనించిన తోటి విద్యార్థులు ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం తరలిస్తున్నారు. విషయం తెలుసుకున్న నరసన్నపేట ఎస్సై బి.గణేష్ ఆస్పత్రికి వెళ్లి ఆరా తీశారు. మేడపై దుస్తులు ఆరేస్తున్న సమయంలో విద్యుత్ వైర్లు తగలడంతో షాక్‌కు గురైనట్లు గుర్తించారు.


