వజ్రపుకొత్తూరు రూరల్: గోదావరి లోయ ప్రతిఘటన పోరాటంలో ఆయుధాన్ని భుజాన వేసుకొని సాయుధ పోరాటం చేసిన యోధురాలు కామ్రేడ్ సీతక్క ఉద్యమాలకు వేగుచుక్క వంటివారని వక్తలు కొనియాడారు. పలాస మండలం బొడ్డపాడులో ఆదివారం సీపీఐఎంఎల్ న్యూడెమొక్రసీ నాయకులు ఆధ్వర్యంలో సీతక్క సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు, పేదలు, పీడిత వర్గాల పక్షాన విప్లవబాట పట్టిన సీతక్క అలుపెరగని పోరాటంలో పిల్లలను వదిలి భర్తతో కలిసి అజ్ఞాత జీవితాన్ని గడిపి ఉద్యమాలకు స్ఫూర్తి నింపారని గుర్తు చేశారు. ఆదివాసీల హక్కులు, వారి సమస్యలపై ఆహర్నిశలు పోరాటం చేశారని చెప్పారు. కార్యక్రమంలో సీపీఐఎంఎల్ న్యూడెమొక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు, ఏఐకెఎంఎస్ జిల్లా అధ్యక్షుడు దొరకల బాలకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షుడు జుత్తు వీరస్వామి, పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దిల వినోద్, ప్రజా సంఘాల నాయకులు పోతనపల్లి కుసుమ, సొర్ర రామారావు, మామిడి భీమారావు, వంకల పాపయ్య, రాపాక మాధవరావు, పి.తాతారావు, సవర బంగ్లా కుమార్, సారా జగన్ తదితరులు పాల్గొన్నారు.


