ఆకులతంపర వద్ద వంశధార నదిలో ఇసుక తవ్వకాలు
కొత్తూరు :
కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానం అక్రమ రవాణాదారులకు సిరులు కురిపిస్తోంది. ఉచితం ముసుగులో నిబంధనలకు తూట్లు పొడుస్తూ యథేచ్ఛగా అక్రమ రవాణా చేస్తున్నారు. అధికారులు సైతం చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో ఇసుకాసురులు చెలరేగిపోతున్నారు. కొత్తూరు మండలంలోని ఆకులతంపర, పొనుటూరు గ్రామాల వద్ద వంశధార నదిలో ఇసుక సిల్టు తొలగించేందుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. నిబంధనల ప్రకారం సిల్టును మనుషులతో తవ్వకాలు జరిపించి ట్రాక్టర్లకు లోడ్ చేయాలి. లోడ్ చేసిన ఇసుకను ర్యాంపు సమీపంలో ఏర్పాటు చేసిన స్టాక్ పాయింట్‌లో అన్‌లోడ్ చేయాలి. స్టాక్ పాయింట్ నుంచి ప్రభుత్వం నిర్దేశించిన ధర ప్రకారం మీ–సేవా కేంద్రాల ద్వారా, గ్రామ సచివాలయాల ద్వారా బిల్లులు చెల్లించి ఇసుక కొనుగోలు చేయాలి. ఇవేవీ ఇక్కడ అమలు కావడం లేదు.
అంతా అక్రమమే..
నిబంధనలకు విరుద్ధంగా ఆకులతంపర, పొనుటూరు (బంకి) గ్రామాల వద్ద వంశధార నదిలో ఇసుక తవ్వకాలు సాగుతున్నాయి. నదిలోకి నేరుగా యంత్రాలను తరలించి తవ్వకాలు జరిపిస్తున్నారు. ప్రొక్లెయిన్లతో తవ్వకాలు చేసి ట్రాక్టర్లకు, టిప్పర్లకు లోడింగ్ చేస్తున్నారు. సుమారు రెండు మీటర్ల లోతు వరకు తవ్వకాలు చేయడంతో భూగర్భజలాలకు ప్రమాదం పొంచి ఉంది. చాలాచోట్ల ఇసుక గోతులు చెరువులను తలపిస్తూ ప్రమాదకరంగా మారాయి. ఈ రెండు ర్యాంపుల నుంచి మండలానికి ఆనుకొని ఉన్న ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడి, హడ్డుబంగి తదితర గ్రామాలకు అక్రమ రవాణా సాగుతోంది. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పొనుటూరు వద్ద ఇసుక లోడింగ్‌కు వెళ్లిన ట్రాక్టర్
కొత్తూరు మండలంలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు
సిల్టు తొలగింపు ముసుగులో అక్రమ రవాణా
చెరువులను తలపిస్తున్న ఇసుక గోతులు
పట్టించుకోని అధికారులు


