సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శ్రీకాకుళం రీజనల్ మేనేజర్‌గా పనిచేసిన తోటకూర రమణమూర్తి రాజు చేసిన మోసాలకు మరొకరు బలి అయ్యారు. 2023లో గార ఎస్‌బీఐ మేనేజర్ ఉరిటి స్వప్నప్రియ బలవన్మరణం చెందగా, తాజాగా మరో బాధితుడు నరసన్నపేట మాజీ బ్రాంచి మేనేజర్ శ్రీకర్ ఆదివారం అనుమానాస్పదంగా మృతి చెందారు. ఆర్‌ఎం చేసిన పాపాలకు ఇప్పటికే ఎంతో మంది బలయ్యారు. బయటికి వచ్చినవి కొన్ని కాగా, వెలుగు చూడనివి మరెన్నో. ఆర్‌ఎంగా రాజు పనిచేసిన హయాంలో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రతిష్ట మసకబారడమే కాకుండా ఖాతాదారులు ఇబ్బందులు పడ్డారు. ఉద్యోగులు సైతం ఇరుక్కున్నారు.
గార కేసులో స్వప్నప్రియ బలవన్మరణం..
గార ఎస్‌బీఐలో తనఖా బంగారం మిస్సింగ్ కేసు అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. నాటి అక్రమాలు ఆర్‌ఎం కనుసన్నల్లో జరిగాయన్న వాదనలు ఉన్నాయి. అయినప్పటికీ, బ్యాంకు ఉద్యోగిని స్వప్నప్రియపైనే పూర్తిగా నెట్టేశారు. ఆ అవమానం భరించలేక 2023 నవంబర్ 28న స్వప్నప్రియ విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చికిత్స పొందుతూ 29న మరణించింది. నాటి ఆర్‌ఎం రాజు నవంబర్ 30వ తేదీన 86 సంచుల తనఖా బంగారం పోయాయంటూ ఫిర్యాదు చేశారు. ఈ కేసులో పోలీసులు డిసెంబరు 7న ఏడుగురిని అరెస్టు చేయగా ప్రథమ ముద్దాయిగా ఆత్మహత్య చేసుకున్న స్వప్నప్రియను చేర్చారు. మరో ఉద్యోగి క్యాషియర్‌తో కలిసి మొత్తం తొమ్మిది మంది నిందితులుగా డిసెంబరు 9న పోలీసులు గుర్తించారు. వాస్తవంగా ఆ ఏడాది సెప్టెంబర్‌లోనే సెంట్రల్ ఆడిట్ జరిగింది. అందులో ఎటువంటి తేడాలేనట్లు చూపించారు. పోలీసుల విచారణలో మాత్రం 14 నెలలుగా స్వప్నప్రియ ద్వారా ఈ తతంగం జరిగినట్లు చెప్పారు. దీన్నిబట్టి అక్కడ ఏం గోల్‌మాల్ జరిగిందో అర్థం చేసుకోవచ్చు. క్యాషియర్ సురేష్‌పై స్వప్నప్రియకు సంబంధించిన వారే దాడి చేశారంటూ అంతకుముందే గార పీఎస్‌లో కేసు నమోదు చేయడం.. అది ఫేక్ అని తేలడం జరిగాయి. ఇలా గార తాకట్టు బంగారం మిస్సింగ్ కేసులో ఎంతో మంది ఇరుక్కుపోయారు. దాని వెనక ఆర్‌ఎం పాత్ర ఉందన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి.
నరసన్నపేట బ్రాంచిలో..
శ్రీకాకుళం ఆర్‌ఎంగా రాజు పనిచేసిన కాలంలో నరసన్నపేటలో మరో అవినీతి చోటు చేసుకుంది. బినామీ పేర్లతో కొంతమంది పర్సనల్ లోన్లు తీసుకుని రూ.3 కోట్ల వరకు టోకరా వేశారు. వ్యక్తిగత రుణాల కోసం ఉద్యోగులు దరఖాస్తులు చేస్తే.. వాటికి అర్హత లేదని వెనక్కి పంపించేసి, ఆ దరఖాస్తులను, ఉద్యోగులు సమర్పించిన శాలరీ సర్టిఫికెట్లు, మిగిలిన డాక్యుమెంట్‌లను ఆధారంగా చేసుకుని, బ్యాంకు సిబ్బందే లోన్లు తీసేసుకున్నారు. దీంట్లో అప్పట్లో మేనేజర్‌గా పనిచేసిన శ్రీకర్‌ను బలి చేశారు. ఆ రూ.3కోట్లు చెల్లించేస్తే కేసుల ఉండవని, లేదంటే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని భయపెట్టారు. వాస్తవంగా రుణాల మంజూరనేది రీజనల్ మేనేజర్ సంతకం లేకుండా కుదరదు. ఫీల్డ్ ఆఫీసర్ పరిశీలించి రుణం ఇవ్వొచ్చని నిర్ధారించిన తర్వాత రీజినల్ ఆఫీస్‌కు ఫార్వర్డ్ చేయడమే బ్రాంచి మేనేజర్ పని. అక్కడ ఓకే చేస్తే రుణం సంబంధిత అకౌంట్‌లో జమైపోతుంది. కానీ, ఈ మొత్తం వ్యవహారాన్ని బ్రాంచి మేనేజర్ శ్రీకర్ పైకే నెట్టేసి, ఆయన ద్వారా సుమారు రూ.60లక్షలు కట్టించినట్టు వాదనలు ఉన్నాయి. అప్పట్లో శ్రీకర్ ఒకసారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారన్న వార్తలు గుప్పుమన్నాయి. శాఖాపరమైన చర్యలు కూడా తీసుకున్నారు. నరసన్నపేట బ్రాంచిలో ఘటన జరిగిన దగ్గరి నుంచి తీవ్ర మనస్థాపంతో శ్రీకర్ ఉన్నారని బ్యాంకు వర్గాలు చెప్పుకుంటున్నాయి. తాజాగా భీమిలి బీచ్ రోడ్డులోని తిమ్మాపురం తీరంలో అనుమానాస్పదంగా మృతిచెందారు.
ఏ–10గా ఆర్‌ఎం రాజు
సుదీర్ఘ విచారణ, స్వప్నప్రియ సోదరుడు కిరణ్ న్యాయపరమైన పోరాటం చేయడంతో పోలీసులు కూడా ఆర్‌ఎం తోటకూర రమణమూర్తి రాజును ఆలస్యంగానైనా నిందితుడిగా చేర్చక తప్పలేదు. న్యాయం జరిగేవరకు వదలనని కిరణ్ పోరాటం చేయడంతో ఆ కేసులో ఏ–10గా చేర్చారు. ఆ మేరకు కిరణ్‌కు సమాచారం అందించారు. ఆర్‌ఎం రాజుపై చర్యలు తీసుకోవాలని స్వప్నప్రియ తల్లి ఏకంగా నిరసనకు కూడా దిగారు. అటు ఎస్పీ, ఇటు జాతీయ మానవ హక్కుల సంఘం, జాతీయ మహిళా కమిషన్‌ను ఆశ్రయించడంతో కేసు మూసివేయలేదు. ఇప్పుడా కేసులో ఎ–10గా రాజును చేర్చారు. విచిత్రమేమిటంటే బ్యాంకు అధికారులు చేసిన పాపానికి గార ఎస్‌బీఐలో బంగారం తాకట్టు పెట్టిన ఖాతాదారుల కష్టాలు నేటికీ తీరడం లేదు. అటు ఉద్యోగులే కాదు ఇటు ఖాతాదారులు కూడా నలిగిపోయిన పరిస్థితి చోటు చేసుకుంది.
వేళ్లన్నీ ఎస్‌బీఐ ఆర్‌ఎం రాజు వైపే..
గతంలో గార ఎస్‌బీఐ ఉద్యోగిని స్వప్న ప్రియ ఆత్మహత్య
తాజాగా నరసన్నపేట మాజీ బ్రాంచ్ మేనేజర్ అనుమానాస్పద రీతిలో మృతి
ఆర్‌ఎం రాజు అక్రమాలపై స్వప్న ప్రియ కుటుంబీకులు న్యాయపోరాటం
ఎట్టకేలకు రాజును నిందితుడిగా చేర్చిన
పోలీసులు


