మూలపేట పోర్టు పునరావాస కాలనీలో రహదారులు బురదమయంగా మారడంతో విష్ణుచక్రం గ్రామానికి చెందిన నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పునరావాస కాలనీకి వచ్చి 16 నెలలు కావస్తున్నా ఇంతవరకు సరైన రోడ్డు ఏర్పాటు చేయకపోవడంతో మండిపడుతున్నారు. చిన్నపాటి వర్షానికే రహదారి బురదమయంగా మారుతోందని, రోజుల తరబడి ఇదే పరిస్థితి నెలకొనడంతో నడిచేందుకు కూడా ఇబ్బందులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పునరావాస కాలనీ రహదారి దుస్థితిని చూసి స్కూల్ ఆటో కూడా రావడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. రోడ్డులో ఆటో కూరుకుపోయి ఏమైనా ప్రమాదం జరిగితే తాము బాధ్యులవుతామని ఆటో డ్రైవర్లు చెబుతున్నారని, దీంతో సుమారు కిలోమీటర్ దూరంలో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్డుకు తరలించి పిల్లలను ఆటో ఎక్కించాల్సి వస్తోందని వాపోతున్నారు. ఇప్పటికై నా తమ త్యాగాలను గుర్తించి పక్కా రహదారిని ఏర్పాటు చేయాలని నిర్వాసితులు కోరుతున్నారు.
–సంతబొమ్మాళి


