● ఐటీఐలో మూడో విడత ప్రవేశాలు
● ఈ నెల 19 వరకు రిజిస్ట్రేషన్‌కు
అవకాశం
● ఐటీఐ కేంద్రాల్లోనే సర్టిఫికెట్ల
వెరిఫికేషన్
పారదర్శకంగా కౌన్సెలింగ్..
మొదటి, రెండో విడతలో ఐటీఐలలో ప్రవేశాలు పొందని విద్యార్థులకు మంచి అవకాశం. శ్రీకాకుళం బలగ హాస్పటల్ జంక్షన్‌లో ఉన్న ప్రభుత్వ డీఎల్‌టీసీ/ఐటీఐ శిక్షణా కేంద్రంలో రెండేళ్ల కోర్సుల్లో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, డ్రాఫ్ట్‌మ్యాన్ సివిల్ ట్రేడులు ఉన్నాయి. సీట్లు భర్తీ అయ్యాక ఐఎంసీ కోటాలో కొన్ని సీట్లు ఉంటాయి. వాటికి స్పాట్ పేమెంట్ కింద కొంత ఫీజు చెల్లించి సీటు పొందవచ్చు.
– వి.రఘురాం, శ్రీకాకుళం డీఎల్‌టీసీ/ఐటీఐ శిక్షణా కేంద్రం అసిస్టెంట్ డైరెక్టర్
శ్రీకాకుళం న్యూకాలనీ:
జిల్లాలోని ఐటీఐ శిక్షణా సంస్థల్లో మొదటి, రెండవ విడతల్లో ప్రవేశాలు పొందలేని విద్యార్థులకు డైరెక్టరేట్ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్, ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ తీపికబురు చెప్పింది. మూడో విడతలో ప్రవేశాలు పొందేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన విద్యార్థులు ఆగస్ట్ 19వ తేదీ సాయంత్రం 4గంటల్లోగా ‘ఐటీఐఅడ్మిషన్స్.ఏపీ.జీవోవి.ఇన్’ అనే వెబ్‌పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
19లోగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్..
ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకున్న విద్యార్థులు సమీపంలోని ప్రభుత్వ ఐటీఐలో ఆగస్ట్ 19వ తేదీ సాయంత్రం 6 గంటల్లోగా సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. టెన్త్‌క్లాస్, కుల ధ్రువపత్రం, టీసీ, స్టడీ, ఆధార్‌కార్డు తదితర అన్ని ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాల్సి ఉంటుందని జిల్లా అధికారులు సూచించారు. మెరిట్ లిస్ట్ డౌన్‌లోడ్ 19వ తేదీ సాయంత్రం 6 గంటల్లోగా జరుగుతుండగా, ఈ నెల 20న కౌన్సెలింగ్ జరుగుతుందని షెడ్యూల్‌లో పేర్కొన్నారు. ప్రైవేటు ఐటీఐల కోసం కౌన్సెలింగ్ ఈ నెల 21న జరగనుంది. ఎంపిక జాబితాను ఈ నెల 22న జిల్లా కన్వీనర్ ప్రిన్సిపాల్ వెల్లడించనున్నారు.


