శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని దళిత సంఘాల జేఏసీ జిల్లా కన్వీనర్ దుర్గాసి గణేష్, కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిస్కా కృష్ణయ్య, అంబేడ్కర్ ఇండియా మిషన్ జిల్లా అధ్యక్షుడు పురుషోత్తం రాంబాబు, అంబేడ్కర్ యువజన సంఘం జిల్లా నాయకుడు రాకోటి రాంబాబు, దళిత హక్కుల పరిరక్షణ సమితి జిల్లా నాయకుడు బైరి ధనరాజ్, మాల మహానాడు జిల్లా నాయకుడు ముచ్చ శ్యాంసుందర్‌లు అన్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్యను గురువారం శ్రీకాకుళం నగరంలోని ఒక ప్రైవేటు హోటల్‌లో కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రోజురోజుకూ విద్యా ప్రమాణాలు క్షీణిస్తున్నాయని, దీనికి ప్రధాన కారణం అధికారుల పర్యవేక్షణ లోపమేనన్నారు. జిల్లాలో 2026 ఫిబ్రవరి 2న పాతపట్నం గురుకులంలో 7వ తరగతి విద్యార్థిని చింతల పూజ మెట్లపై నుంచి పడి మృతి చెందిన ఘటనకు దాదాపు ఏడు నెలలు గడిచినా, సంబంధిత ప్రిన్సిపాల్‌తో పాటు బాధ్యులపై ఇప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. అదే ప్రిన్సిపాల్‌పై కేసు విచారణ కొనసాగుతుండగానే గ్రేడ్–1 ప్రమోషన్ ఇచ్చి శ్రీకాకుళానికి సమీపంలోని పెద్దపాడు గురుకులానికి ప్రిన్సిపాల్‌గా నియమించడం తప్పు చేసిన వారిని
ప్రోత్సహించడమేనన్నారు. ఇది దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యగా పేర్కొన్నారు. వెంటనే ఆమెను సస్పెండ్ చేసి సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ విద్యా సంవత్సరంలో 10వ తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాలు తీవ్రంగా పడిపోవడానికి జిల్లా కో–ఆర్డినేటర్ నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ, ఆమెను డీసీవో హోదా నుంచి తప్పించి బదిలీ చేయాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లో బోధన, బోధనేతర సిబ్బంది ఖాళీలను భర్తీ చేయకపోవడం వల్ల విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే గురుకులాల్లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులు, పారిశుద్ధ్య కార్మికులకు గత ఏడు నెలలుగా వేతనాలు చెల్లించలేదని, కనీస వేతనాలు అమలు చేయడం లేదని, ఈపీఎఫ్, ఈఎస్‌ఐ సక్రమంగా చెల్లించడం లేదని ఆరోపించారు. సంబంధిత కాంట్రాక్టు సంస్థలు, అధికారులపై కఠిన చర్యలు తీసుకుని కార్మికులకు వెంటనే బకాయి వేతనాలు చెల్లించాలని కోరారు.


