● రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వెంటుకూరి ఏవీఎస్ సూర్యనారాయణ రాజు
శ్రీకాకుళం పాతబస్టాండ్:
గ్రామస్థాయిలో బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై గ్రామ కమిటీలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వెంటుకూరి ఏవీఎస్ సూర్యనారాయణ రాజు ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సంబంధిత జిల్లా అధికారులతో బుధవారం కమిషన్ సభ్యులు గంగ సూర్యనారాయణ, డాక్టర్ డి.శ్రీనివాసమూర్తిలతో కలిసి ఆయన సమీక్షించా రు. కమిటీలు చురుగ్గా పనిచేసి గ్రామస్థాయి నుంచి రిపోర్టులు తెప్పించుకోవాలని సూచించారు. 1098 బోర్డులు ఎక్కడా లేవని, ఏర్పాటు చేయా లని కమిషన్ సభ్యులు డాక్టర్ శ్రీనివాస మూర్తి కోరారు. సీడీపీఓలు క్షేత్రస్థాయిలో నెలలో 15 రోజులు పర్యటన చేయాలన్నారు. సూపర్‌వైజర్లు నెలకు 25 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటన చేయాలన్నారు. పోక్సోపై మాట్లాడుతూ చాలా కేసుల్లో నిందితులకు శిక్ష పడడం లేదని, ఈ దిశగా మరింతగా కృషి చేయాలని సూచించారు. మిషన్ వాత్స ల్య ద్వారా అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 18 సంవత్సరాలు నిండే వరకు వాళ్లకు కావలసిన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నట్లు వివరించారు. ఆ పథకాలు వాళ్లకు అందే విధంగా, లబ్ధిదారులకు ఆ లబ్ధి చేకూరేలా మనమంతా భాగస్వామ్యులం కా వాలని పిలుపునిచ్చారు. మంగళవారం, బుధవారాల్లో చేసిన పర్యటనలో గుర్తించిన లోపాలను రాబోయే రోజుల్లో సరిదిద్దుకోవాలని సూచించారు. కమిషన్ సభ్యులు గంగ సూర్యనారాయణ మాట్లాడుతూ ఈ జిల్లాలో బడులు, హాస్టళ్లలో సదుపాయాలు పెంచాలన్నారు.
డ్రాపౌట్స్, జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలల్లో ఎంత మంది పిల్లలు చదువుతున్నారో జిల్లా విద్యాశాఖ అధికారి ఎ. రవిబాబు కమిషన్‌కు వివరించారు. పనిచేయని ఆర్‌ఓ ప్లాంట్లు సెప్టెంబర్ నాటికి మరమ్మతులు చేపట్టనున్నట్లు వివరించారు. ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ శ్రీకాంత్ జిల్లాలో గల ఆస్పత్రి, సిబ్బంది వివరాలను కమిషన్‌కు వివరించారు. విద్యార్థుల్లో రక్తహీనత పారద్రోలే విధంగా చర్యలు చేపట్టాలని కమిషన్ సభ్యులు డాక్టర్ శ్రీనివాస్ మూర్తి కోరారు. బాల కార్మికులపైనా ఆరా తీశారు. మంగళవారం సందర్శించిన బీసీ హాస్టల్స్‌లో మరుగుదొడ్లు పిల్లలకు సరిపోయేవి లేవని, మరుగుదొడ్ల కొరత ఉందని, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌కి లెటర్ పంపిస్తే వారు మంజూరు చేస్తారని సభ్యులు శ్రీనివాస్ మూర్తి తెలిపారు. సంక్షేమ అధికారులు వసతి గృహాల్లో రాత్రి బస చేయాలన్నారు. బెజ్జిపురం యూత్ క్లబ్ అధ్యక్షులు ప్రసాదరావు మాట్లాడుతూ యూత్ క్లబ్ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను కమిషన్ కు వివరించారు.


