● తల్లికి బదులుగా పనికి వెళ్లిన కుమారుడు ● విద్యుదాఘాతంతో మృతి
కవిటి: స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ప్రైవేట్ స్వీపర్‌గా 17 ఏళ్లుగా పనిచేస్తున్న లిమ్మాయి రుక్మిణికి ఆరోగ్యం బాగోలేదని ఆమె బదులుగా కొడుకు లిమ్మాయి మోహనరావు(39) విధి నిర్వహణకు హాజరు కాగా.. విద్యుత్‌షాక్ తగిలి మరణించాడు. బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి కవిటి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తల్లి అనారోగ్యం కారణంగా పోలీస్ స్టేషన్ శుభ్ర పరిచేందుకు మోహనరావు వెళ్లాడు. అక్కడ స్టేషన్ గదులను శుభ్రం చేశాడు. ఆ తర్వాత తనకు ఖర్చుల కోసం కొబ్బరికాయలు తీసి అమ్మకం చేసేందుకు స్టేషన్ పరిసరాల్లో ఉన్న కొబ్బరి చెట్టు నుంచి ఇనుప గజంతో కాయలు తీసే ప్రయత్నంలో చెట్టు సమీపంలో వెళుతున్న విద్యుత్ తీగలకు ఆ ఇనుప గజం తాకి షాక్‌కు గురయ్యాడు. దీంతో అతడిని వెంటనే కవిటి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. కానీ మార్గమధ్యంలోనే మోహనరావు మృతిచెందాడని పోలీసులు తెలిపారు. మృతునికి భార్య లిమ్మాయి ప్రమీల, కొడుకు ఉజ్వల్, కూతురు అనూజ ఉన్నారు. చెట్టంత కొడుకు మరణించడంతో తల్లి, భార్య, పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ మేరకు కవిటి ఎస్‌ఐ వి.రవివర్మ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


