● దాత ఇచ్చిన స్థలం వినియోగించని పోస్టల్ శాఖ ● ప్రస్తుతం ఊరికి దూరంగా పోస్టల్ సేవలతో అవస్థలు
కవిటి: మండల కేంద్రంలో పోస్టాఫీసు స్థలం అన్యాక్రాంతమవుతోంది. ఆరు దశాబ్దాల క్రితం బెందా ళం పట్టాభి రామయ్య పోస్ట్ ఆఫీస్ భవనం నిర్మా ణం కోసం ఇచ్చిన స్థలం ఆక్రమణకు గురవుతోంది. ఆ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులు సొంత అవసరాలకు వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే స్థలం కొంత తగ్గిపోయిందనే వాదన కూడా వినిపిస్తోంది. వాస్తవానికి మండల కేంద్రంలో కవిటి సబ్ పోస్ట్ ఆఫీస్ గ్రామ శివారులోని మండల విద్యా వనరుల కేంద్రం సమీపంలో అద్దె భవనంలో నిర్వహిస్తున్నా రు. ఈ సబ్ పోస్ట్ ఆఫీస్ పరిధిలో జగతి, శిలగం రాజపురం, బెజ్జిపుట్టుగ, డి.గొనపపుట్టుగ బ్రాంచ్ పోస్ట్ ఆఫీసులు నడుస్తున్నాయి. గతంలో కవిటి మెయిన్ రోడ్డు పై ఉన్న పోస్ట్ ఆఫీస్‌ను గ్రామ శివారున ఉన్న అద్దె భవనానికి మార్చేశారు. దీంతో ఖాతాదారులు ఇబ్బంది పడుతున్నారు. కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని పోస్టల్ శాఖకు దాత వితరణగా ఇచ్చిన ఆ స్థలంలో ఇప్పటి వరకు సొంత భవనమే నిర్మాణం కాలేదు.
ఇప్పుడు ఈ స్థలాన్ని ఆక్రమించే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. వెంటనే సొంత భవన నిర్మాణం చేపట్టకుంటే భారీ మూల్యం తప్పదని చర్చ సాగుతోంది. ఈ స్థలాన్ని ఇచ్చిన దాతల వంశీయులు కూడా పోస్టల్ శాఖ భవన నిర్మాణం చేయలేకుంటే ఆ స్థలాన్ని మాకు ఇచ్చేస్తే వేరే శాఖలకు ఇస్తామని చెబుతున్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ కార్యాలయ వర్గాలు పోస్టల్ శాఖ ఉన్నతాధికారులు దృష్టికి తెలిపి సమస్య తీవ్రతను గుర్తించాలని స్థానికులు కోరుతున్నారు.


