రణస్థలం: లావేరు మండలంలోని రాయిలింగారిపేట గ్రామానికి చెందిన గొర్లె భవాని(45) గత నెల 31వ తేదీన వ్యవసాయ పనులకు పొలానికి వెళ్లగా పాటుకాటు వేసింది. దీంతో ఆమెను చికిత్స కోసం రణస్థలం సీహెచ్‌సీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం ఆమె మృతి చెందింది. ఈమెకు భర్త భానోజీరావు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. లావేరు ఎస్‌ఐ వి.సందీప్ కుమార్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
కిడ్నీ వ్యాధితో మహిళ మృతి
నందిగాం: మండలంలోని దిమ్మిడిజోలకు చెందిన కొల్లి భాగ్యవతి(40) కిడ్నీ వ్యాధితో మృతి చెందింది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల మేరకు.. భాగ్యవతి గత కొన్నేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతోంది. ఆరేళ్ల క్రితం ఆమె తల్లి అనసూయమ్మ ఒక కిడ్నీని కుమార్తె భాగ్యవతికి ఇవ్వడంతో కిడ్నీ మార్పిడి చేశారు. భాగ్యవతి భర్త సాంబమూర్తి రాజమహేంద్రవరంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. భాగ్యవతి తన ఇద్దరు కుమారులు, ఒక కుమార్తెతో కలిసి టెక్కలిలోని సాయిచంద్రనగర్‌లో నివాసం ఉంటున్నారు. మంగళవారం ఆమె తీవ్ర ఆయాసంతో అస్వస్థతకు గురి కావడంతో బంధువులు టెక్కలి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు.
పంద్రాగస్టు వేడుకలకు
పక్కా ఏర్పాట్లు
శ్రీకాకుళం పాతబస్టాండ్: స్వాతంత్య్ర దినోత్సవానికి పక్కాగా ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఆదేశించారు. స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లపై కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆయన జిల్లా అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయా శాఖలు ప్రభుత్వ పథకాల పై శకటాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. స్వాతంత్య్ర దినోత్సవ సందేశం తయారు చేయాలని జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి చెన్నకేశవరావును ఆదేశించారు. వేదిక ఏర్పాట్లు ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ చూడాలన్నారు. ఉద్యోగంలో ఉత్తమ ప్రతిభ చూపిన ఉద్యోగులకే సర్టిఫికెట్‌కు ప్రతిపాదించాలన్నారు.
అక్రమంగా చెరువు గట్టుపై రహదారి నిర్మాణం
ఆమదాలవలస: శ్రీకాకుళం రూరల్ మండలం, ఆమదాలవలస మున్సిపాలిటీ నాదానపురం గ్రామ సమీపంలోని చిట్టివాని చెరువు గట్టుపై ఎటువంటి అనుమతులు లేకుండా రహదారి నిర్మాణ పనులు ఆ గ్రామానికి చెందిన ఒక టీడీపీ కార్యకర్త చేపడుతున్నారని గ్రామానికి చెందిన కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఇటీవల చింతాడ గ్రామానికి చెందిన రైతులు కలెక్టర్ గ్రీవెన్స్‌లో వినతిపత్రం ఇచ్చారు. చెరువు వెనుక భాగంలో సుమారు 12 ఎకరాల భూమి ఉండడంతో ఆ భూములను రియల్ ఎస్టేట్‌గా మార్చుకోవడం కోసం అక్రమంగా రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే అతనికి శ్రీకాకుళం, ఆమదాలవలస ఎమ్మెల్యేల అండదండలు ఉన్నాయని చెబుతున్నట్లు తెలుస్తోంది. అందువలన ఇప్పటికై నా అధికారులు స్పందించి దీనిపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
టిడ్కో కాలనీలో రెచ్చిపోతున్న బైక్ రైడర్లు
శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని పాత్రునివలస టిడ్కో కాలనీలో పలువురు బైక్ రైడర్లు రెచ్చిపోతున్నారని అదే కాలనీకి చెందిన పలువురు మంగళవారం రాత్రి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల కాలంలో రోడ్లపై బైక్ రైడర్లు పందెలు వేసుకుంటూ ద్విచక్ర వాహనాలతో నానా హంగామా చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం చిన్నారులకు బైక్‌లతో పెను ప్రమాదం తప్పిందని పోలీసులకు వివరించారు. ఇదే విషయాన్ని బైక్ రైడర్లను ప్రశ్నించగా బూతులు తిడుతూ వాగ్వాదానికి దిగారని తెలిపారు. దీంతో రూరల్ పోలీసులు బైక్ రైడర్లను స్టేషన్‌కు పిలిపించి నలుగురిపై బైండోవర్ కేసుల నమోదు చేశారు.


