● క్రీడాకారుల్లో స్టాండర్డ్స్ పెరిగాయి ● స్టేట్‌మీట్‌కు బాగా ఏర్పాట్లు చేశారు ● ఏపీ రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అంకమ్మ చౌదరి
శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్రంలో బ్యాడ్మింటన్ గేమ్ దినదినాభివృద్ధి సాధిస్తుండడం ఆనందంగా ఉందని బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(భాయ్) సంయుక్త కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్(ఏపీబీఏ) ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి.అంకమ్మ చౌదరి అన్నారు. గతంలో పోల్చితే ఏపీ క్రీడాకారుల్లో స్టాండర్డ్స్ పెరిగాయని చెప్పడానికి గర్వంగా ఉందని పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలో జరుగుతున్న ఏపీ రాష్ట్రస్థాయి సీనియర్స్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్–2026 పోటీల పర్యవేక్షణకు హాజరైన ఆయన మంగళవారం ఒక హోటల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పలు అంశాలను ప్రస్తావించారు.
శ్రీకాకుళం ఆతిథ్యం అద్భుతం
శ్రీకాకుళంలో ఇప్పటివరకు నాలుగు రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీలు జరిగిన విషయాన్ని అంకమ్మ చౌదరి గుర్తు చేశారు. ఇక్కడ జరిగే పోటీలకు బ్యాడ్మింటన్ సంఘ ప్రతినిధులు మంచి ఏర్పాట్లు, వసతులు, భోజనాలు, సదుపాయాలు కల్పిస్తుంటారని కొనియాడారు. ప్రస్తుతం జరుగుతున్న సీనియర్స్ స్టేట్‌మీట్‌కు కూడా రాష్ట్ర నలుమూలల నుంచి హాజరైన క్రీడాకారులు, రిఫరీలు, టెక్నికల్ అఫీషియల్స్‌కు గొప్ప ఆతిథ్యాన్ని అందిస్తున్నారని అభినందించారు. శ్రీకాకుళం జిల్లాలో మరో మూడు, నాలుగు కోర్టులు ఏర్పాటైన పక్షంలో ఇక్కడ నేషనల్ మీట్ లేదా ర్యాంకింగ్ టోర్నీని నిర్వహించేలా ఖచ్చితంగా అనుమతులు ఇస్తామన్నారు. క్రీడల అభివృద్ధి కోసం దాతలతో పాటు ప్రభుత్వాలు కూడా ప్రోత్సహిస్తే ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ చీఫ్ ప్యాట్రన్ డాక్టర్ గూడేన సోమేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు కిల్లంశెట్టి సాగర్ తదితరులు మాట్లాడుతూ జిల్లాలో బ్యాడ్మింటన్ క్రీడాభివృద్ధికి సమష్టిగా కృషిచేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యనిర్వహక కార్యదర్శి, మీట్ ఆర్గనైజింగ్ కమిటీ ముఖ్య ప్రతినిధి నారాయణశెట్టి వెంకట కిరణ్‌కుమార్, జిల్లా బ్యాడ్మింటన్ సీఈవో సంపతిరావు సూరిబాబు, ఉపాధ్యక్షుడు గురుగుబెల్లి ప్రసాద్, కంచరాన వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు.
17 నుంచి వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్
ఈనెల 17 నుంచి 23 వరకు ఢిల్లీలో జరిగే సీనియర్ వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పోటీలకు భారతదేశం ఆతిథ్యమిస్తోందని వెల్లడించారు. 2009లో హైదరాబాద్‌లో జూనియర్ వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పోటీలు జరిగాయమన్నారు. 17 ఏళ్ల తర్వాత మరలా మనదేశం మెగా టోర్నీకి ఆతిథ్యమిస్తుండడం దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు.


