పాతపట్నం: ఉత్కళాంధ్రుల ఆరాధ్య దైవమైన పాతపట్నం నీలమణిదుర్గ అమ్మవారికి మొక్కులు చెల్లించేందుకు మహిళలు భారీగా తరలిరావడంతో నగరంలో మంగళవారం ఆధ్యాత్మిక శోభ నెలకొంది. పలు వీధుల్లో ఆషాఢమాస ఆవేటి వారాల పండగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నగర వాసులు తమ ఇళ్ల నుంచి బయల్దేరి ఘటాలను తీసుకుని ఊరేగింపుగా నీలమణి దుర్గ అమ్మవారి ఆలయం వరకు మేళతాళాలు, డప్పు వాయిద్యాలతో వెళ్లారు. మహిళలు అమ్మవారికి ముర్రాటాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం అషాఢ మాసం మొదటి పౌర్ణమి తర్వాత తొలి మంగళవారం ఆవేటి పండుగ నిర్వహించడం ఆనవాయితీ అని ఈవో టి.వాసుదేవరావు, ఆలయ చైర్మన్ అక్కందర సన్యాసిరావులు తెలిపారు. ఎటుంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సీఐ కిల్లి వెంకటరావు పర్యవేక్షణలో పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.


