శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని తండేవలసకు వెళ్లే రహదారిలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కోన ఉషారాణి (44) అనే మహిళ మృతి చెందింది. రూరల్ ఎస్‌ఐ సురేష్ తెలిపిన వివరాల మేరకు.. ఆమదాలవలసలోని గుట్టిముడి గ్రామానికి చెందిన ఉషారాణి స్వీపర్‌గా ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తోంది. సోమవారం రాత్రి డ్యూటీ అనంతరం రాత్రి 9 గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన చింతాడ శ్రీనివాస్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనం మీదుగా వెళ్తుండుగా.. స్థానిక ఆర్టీవో కార్యాలయం పరిసర ప్రాంతంలో వాహనం అదుపు తప్పడంతో వెనుక కూర్చున్న ఉషారాణి పడిపోయింది. దీంతో ఆమె తలకు బలమైన గాయం కావడంతో వెంటనే శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం ఆమె మృతి చెందిందని ఎస్‌ఐ తెలిపారు. మృతురాలి తల్లి గడ్డెమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆగి ఉన్న ట్యాంకర్‌ను ఢీకొని...
రణస్థలం: మండలంలో పైడిభీమవరం పంచాయతీలోని పారిశ్రామికవాడలో పాలవలస దగ్గర
డాక్టర్ రెడ్డీస్ సెజ్ పరిశ్రమ గేటు సమీపంలో ఆగివున్న ట్యాంకర్‌ను ద్విచక్ర వాహనంతో ఇద్దరు వ్యక్తులు బలంగా ఢీకొన్నారు. మంగళవారం మధ్యాహ్నం 1.20 గంటల సమయంలో ద్విచక్ర వాహనంతో వచ్చిన ఇద్దరు వ్యక్తులు అతివేగంగా ట్యాంకర్‌ను ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో వెనుకకూర్చున్న మండలంలోని వెంకటరావుపేట గ్రామానికి చెందిన బూర్లె రమణ(32) అక్కడికక్కడే మృతి చెందగా, డ్రైవింగ్ చేస్తున్న పతివాడపాలెం గ్రామానికి చెందిన పతివాడ రాంబాబుకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో అతడిని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. రమణ మరణ వార్తతో వెంకటరావుపేట గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఘనటపై ఎస్‌ఐ వి.సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


