● బడి పిల్లలపై బ్యాగుల భారం
● అధిక పుస్తకాలతో వెన్నెముకపై ఒత్తిడి
● నొప్పులతో సతమతమవుతున్న చిన్నారులు
● పట్టించుకోని అధికారులు
హిరమండలం: ఆటపాటలతో సాగాల్సిన చిన్నారుల బాల్యం ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల పుణ్యమా అని మోయలేని పుస్తకాల భారంతో నలిగిపోతోంది. జిల్లావ్యాప్తంగా 2,612 ప్రభుత్వ, 402 ప్రైవేటు పాఠశాలల్లో కలిపి 2.5 లక్షల మందికిపైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే చాలా ప్రైవేటు పాఠశాలల్లో 1–5 తరగతులకు ఎన్‌సీఈఆర్టీ పుస్తకాలతో పాటు సొంత మెటీరియల్ అంటగడుతున్నారు. అలాగే ఆరో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలలు ధనార్జనే ధ్యేయంగా ఒలింపియాడ్, జేఈఈ, నీట్ స్టడీ మెటీరియల్ అంటూ భారీగా పుస్తకాలను ఇస్తున్నారు. దీంతో బండెడు పుస్తకాలను బ్యాగులో వేసుకుని నేటితరం బాల్యం నిత్యం నరకయాతన అనుభవిస్తోంది. దాదాపు రెండు నుంచి నాలుగు వరకు అంతస్తుల్లో ఉన్న తరగతి గదులకు మెట్లు మీదుగా చేరలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఫలితంగా అనారోగ్యాల బారిన పడుతున్నారు.
అమలు కాని ‘స్కూల్ బ్యాగ్ పాలసీ’
విద్యాహక్కు చట్టం–2009 యశ్‌పాల్ కమిటీ సిఫార్సుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం స్కూల్ బ్యాగ్ పాలసీని ఆరేళ్ల క్రితం అమల్లోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం 1, 2 తరగతుల వారికి తెలుగు, ఆంగ్లం, గణితం.. 3, 4, 5 తరగతులైతే ఆ మూడింటికి తోడు పరిసరాల విజ్ఞానం, 6 నుంచి 10 తరగతులైతే ఆరు పుస్తకాలే ఇవ్వాలి. కానీ స్కూల్ బ్యాగ్ పాలసీని ప్రైవేటు పాఠశాలల్లో సక్రమంగా అమలు చేయడం లేదు. వేర్వేరు పేర్లతో అధికంగా పుస్తకాలు కట్టబెడు తున్నారు. దీంతో బాల్యంపై మోయలేని పుస్తకాల భారం పడుతోంది. స్కూల్ బ్యాగ్ పాలసీ ప్రకారం విద్యార్థి శరీర బరువులో 10 శాతానికి మించి స్కూల్ బ్యాగు బరువు ఉండకూడదనేది ప్రాథమిక సూత్రం. అయితే ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల ర్యాంకుల ఉచ్చు, అదనపు సిలబస్ మార్కెట్ వ్యూహాల వల్ల ఈ నిబంధనలన్నీ తుంగలో తొక్కేస్తున్నారు. ప్రభుత్వాలు జీవోలు జారీ చేయడం, అధికారులు అప్పుడప్పుడు తనిఖీలు చేయడం మినహా క్షేత్రస్థాయిలో శాశ్వత పరిష్కారం లభించడం లేదు.
పాఠశాల విద్యార్థులు తమ శరీర బరువులో 10 శాతానికి మించి బరువులు మోయడం అత్యంత ప్రమాదకరం. లేత వయస్సులో ఎముకలు, వెన్నెముక పూర్తిగా ఎదుగుదల దశలో ఉంటాయి. అలాంటి సమయంలో ప్రతిరోజూ ఎక్కువ బరువును వీపుపై మోస్తూ బస్సులు, మెట్లు ఎక్కడం వల్ల వెన్నుపూసపై విపరీతమైన ఒత్తిడి పడుతుంది. చిన్న వయస్సులోనే నడుము నొప్పి, మెడ నొప్పి, భుజాల కండరాలు పట్టేయడం వంటి సమస్యలు వస్తాయి. స్కూల్ బ్యాగుల బరువు తక్షణమే తగ్గించకపోతే భావితరం శారీరకంగా బలహీనపడుతుంది.
– పి.సాయికుమార్, పీహెచ్‌సీ వైద్యాధికారి, హిరమండలం


