శ్రీకాకుళం పాతబస్టాండ్: మీడియేషన్ 3.0తో ప్రజల ఇంటి వద్దకే న్యాయ సేవలు అందుతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.సునీత కొండబోలు అన్నారు. జిల్లా న్యాయ సేవా సదన్‌లో ‘మీడియేషన్ 3.0’ కార్యక్రమాన్ని సోమవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కొండబోలు పాల్గొని ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సమాజంలో పెరుగుతున్న వివాదాలను త్వరితగతిన, ఖర్చు లేకుండా పరిష్కరించడానికి మధ్యవర్తిత్వం అత్యుత్తమ మార్గమన్నారు. మీడియేషన్ 3.0 ద్వారా సామాన్య ప్రజలకు ఇంటి వద్దకే న్యాయం చేరుతుందని తెలిపారు. ప్రజలు తమ వ్యాజ్యాలను కోర్టుకు వెళ్లకుండానే మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని, దీనికి సంబంధించిన మరిన్ని వివరాలకు జిల్లా న్యాయ సేవా సదన్, శ్రీకాకుళం ను సంప్రదించాలని అధికారులు తెలిపారు. సీనియర్ డివిజన్ అడిషనల్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్‌చార్జి కార్యదర్శి షేక్ ఇబ్రహీం షరీఫ్ మాట్లాడుతూ కోర్టు తీర్పు కంటే రాజీ ద్వారా వచ్చే పరిష్కారం శాశ్వతంగా ఉంటుందని తెలిపారు. ఈ మీడియేషన్‌లో భాగంగా జిల్లాలోని అన్ని కోర్టుల్లో ప్రత్యేక మధ్యవర్తిత్వ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
టెట్‌కు పక్కా ఏర్పాట్లు
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఈ నెల 5 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనున్న ఆన్‌లైన్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్–2026 నిర్వహణకు జిల్లా యంత్రాంగం పక్కా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులతో సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా పరిధిలోని 7 కేంద్రాల్లో మొత్తం 12,593 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు. ఎచ్చెర్లలోని శ్రీ శివాని కాలేజ్, శ్రీ వెంకటేశ్వర కాలేజ్, నర్సన్నపేటలోని కోర్ టెక్నాలజీస్, టెక్కలిలోని ఐతామ్ కాలేజ్ కేంద్రాలతో పాటు పొరుగు రాష్ట్రమైన ఒడిశాలోని బరంపురం పరిధిలోని స్మిత్ అసిస్టెంట్ ఎగ్జామినేషన్ సెంటర్, ఐవోఎన్ డిజిటల్ జోన్, గవర్నమెంట్ ఐటీఐ కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయని వివరించారు. అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకుని, ఉదయం 9:30 గంటల పరీక్షకు 8:30 గంటలకు, మధ్యాహ్నం 2:30 గంటల పరీక్షకు 1:30 గంటలకే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. సందేహాల నివృత్తి కోసం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, సహాయ కమిషనర్ జి.చంద్రభూషణ్ 7569633183, సూపరింటెండెంట్ ఎంవీటీ రామనాథం 9490557309, సీనియర్ అసిస్టెంట్ కె.శ్యామలరావు 9494094904 లను సంప్రదించవచ్చని వెల్లడించారు. జిల్లా విద్యా శాఖాధికారి రవిబాబు, పలు శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఎస్పీ గ్రీవెన్స్‌కు 61 వినతులు
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఎస్పీ గ్రీవెన్సుకు బాధితుల నుంచి 61 వినతులు అందాయి. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి బాధితులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.
ప్రాణభయం ఉంది.. రక్షణ కల్పించండి
తమ పొలం పక్కన గెడ్డవాగు తోవ ప్రభుత్వం వారిదని తెలిసినా, ఆ మార్గం గుండా రాకూడదని పక్క పొలం రైతు అల్లాడ గోవిందరావు తనపైన, తన కుటుంబంపైన దాడికి పాల్పడ్డాడని లావేరు మండలం కేశవరాయపురం గ్రామానికి చెందిన లంకలాపల్లి రమణ ఎస్పీ గ్రీవెన్సులో ఫిర్యాదు చేశారు. గతంలో హత్య కేసులో గోవిందరావు ముద్దాయి అయినందున తనకు ప్రాణభయం ఉందని, రక్షణ కల్పించాలని కోరారు.
క్రీడలతో మానసిక ఉల్లాసం
శ్రీకాకుళం పాతబస్టాండ్: క్రీడలతో మానసిక ఉల్లాసం లభిస్తుందని, ప్రతి ఒక్కరూ క్రీడలపై ఆసక్తి కనబర్చాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.సునీత సూచించారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే వివిధ రకాల ఆటల పోటీలను సోమవారం కోర్టు వద్ద ఆమె ప్రారంభించారు. కార్యక్రమంలో ఇతర న్యాయమూర్తులు, బార్ ప్రతినిధులు, న్యాయవాదులు పాల్గొన్నారు.


