శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో తల్లికి వందనం పథకం అందకపోవడంతో అనేక మంది పేద తల్లిదండ్రులు అవస్థలు పడుతున్నారు. ఈ పథకం కొంతమందికే పరిమితం చేసి, మిగిలిన వారికి వివిధ కారణాలు చూపి నిలిపివేశారు. దీంతో సోమవారం పీజీఆర్‌ఎస్‌లో అనేకమంది ఫిర్యాదులు చేశారు. వాటిని పరిశీలిస్తున్న అధికారులు హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ తప్పు, ఆదాయపు పన్ను తదితర కారణాలతో వారిని తిప్పి పంపుతున్నారు. దీనిపై గత రెండు వారాలుగా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. అయితే ఒక్కటి కూడా పరిష్కారం అయినట్లు లేదు. ఎక్కువగా హౌస్‌హోల్డ్ మ్యాపింగ్‌లో లోపాలు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా అర్హులైన పలువురు సంక్షేమ పథకాల లబ్ధికి దూరమవుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌ను సవరణ చేయలేదు. అవకాశం కూడా ఇవ్వలేదు. దీంతో ఇటీవల వివాహం అయినవారు. వేరే కుటుంబాలుగా ఏర్పడినవారు, పిల్లలు ఉన్నవారు నాలుగేళ్ల క్రితం ఉన్న మ్యాపింగ్‌లోనే ఉంటున్నారు.
జిల్లాలో అనేక మందికి అందని ‘తల్లికి వందనం’
పీజీఆర్‌ఎస్‌లో భారీగా ఫిర్యాదులు
గత వారం ఫిర్యాదులు పరిష్కారమవ్వని వైనం
గతవారం పీజీఆర్‌ఎస్‌కు వచ్చాను. అప్పుడు రెండు రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు. కానీ ఇప్పటికీ పరిష్కారం అవ్వలేదని నందిగాం మండలం దీనబందుపురం గ్రామానికి చెందిన పోలాకి శారద ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, వారిద్దరికీ తల్లికి వందనం పథకం నగదు పడలేదని వాపోయారు. గతేడాది పథకం వచ్చిందని, కానీ ఈ ఏడాది రాలేదని తెలిపింది. తనకు కొడుకు మోక్షిత్ నాలుగో తరగతి, పాప నిత్యశ్రీ రెండో తరగతి చదువుతున్నారని తెలిపారు. వారికి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ వలన నగదు పడలేదని అధికారులు చెబుతున్నారన్నారు. ఇప్పటికై నా అధికారులు సమస్యను పరిష్కరించి నగదు పడేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


