సర్కారు వైఖరిపై సన్నకారు రైతుల ఆగ్రహం 50 సెంట్ల కంటే తక్కువ భూమి ఉంటే యూరియా లేనట్టే పక్క రైతుల్ని కలుపుకుంటేనే యూరియా ఇస్తున్న అధికారులు
తిప్పలు పడుతున్నాం
రైతుల్ని ఇబ్బందులు పెట్టడం సరికాదు
టెక్కలి: యాభై సెంట్లు కంటే ఎక్కువ భూమి ఉంటేనే రైతు.. ఆ రైతుకే యూరియా. ఇదీ ప్రభుత్వ విధానం. ఈ ఏడాది ప్రవేశపెట్టిన యాప్‌లో 50 సెంట్లు కంటే తక్కువ భూమి ఉన్న రైతులను చూపకపోవడంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల టెక్కలి పీఏసీఎస్ కార్యాలయం వద్ద మేఘవరం పంచాయతీకి చెందిన రైతులకు యూరియా పంపిణీ చేపట్టారు. అయితే 50 సెంట్లు భూమి విస్తీర్ణం కలిగిన రైతులకు ఇదే పరిస్థితి ఎదురైంది. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితులు రైతులకు ఎదురు కాలేదు. వాస్తవంగా తక్కువ భూమి ఉన్నా, అధికంగా భూమి ఉన్నా గతంలో యూరియా పంపిణీ చేసేవారు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకువచ్చిన ఏపీఏఐఎంఎస్ యాప్ ద్వారా పంపిణీ విధానంతో రైతులకు పూర్తి స్థాయిలో యూరియా అందకపోవడంతో పాటు తక్కువ విస్తీర్ణం కలిగిన రైతులకు మొండి చేయి చూపుతున్నారు. ఇదే పరిస్థితి జిల్లా వ్యాప్తంగా కనిపిస్తోంది.
అధికారులు ఏమంటున్నారంటే..
సాగులో యూరియా వాడకం తగ్గించే క్రమంలో యాప్ ద్వారా రైతులకు అవసరమైన మేరకు మాత్ర మే యూరియా అందజేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. తక్కువ విస్తీర్ణం కలిగిన రైతులను యాప్‌లో జోడించి ఒకే రైతు పేరుతో నిర్దేశించిన భూమి విస్తీర్ణం పెంచుతూ యూరియాను అందజేసి మిగిలిన వారికి సర్దుకోమని చెబుతున్నామని అధికారులు చెప్పడం విడ్డూరమనిస్తోంది. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఇటీవల జిల్లా అధికారులు వెల్లడించిన లెక్కల ప్రకారం సుమారు 83,961 మెట్రిక్ టన్నుల మేరకు అన్ని రకాల ఎరువుల అవసరం ఉంది. అయితే సుమారు 28 వేల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నట్లు లెక్క చూపించా రు. వాటిలో యూరియా విషయానికి వస్తే 38,131 మెట్రిక్ టన్నులు యూరియాకు గాను సుమారు 16,513 మెట్రిక్ టన్నులు అందుబాటు లో ఉన్నట్లు వెల్లడించారు. క్షేత్ర స్థాయిలో మాత్రం యూరియా పంపిణీలో గందరగోళంతో పాటు తక్కువ విస్తీర్ణం కలిగిన రైతులకు యూరియా సర్దుబాటు చేసుకునే విషయంలో అనేక అవస్థలకు గురవుతున్నారు.
నాకు 50 సెంట్లు పొలం ఉంది. కౌలుకు కొంతపొలం చేస్తున్నాను. నాకు అరబస్తా యూరియా ఇచ్చారు. నేను కౌలుకు చేస్తున్న యజమానులు అందుబాటులో లేరు. నేను వ్యవసాయం ఎలా చేసేది.
– చల్ల హనుమంతురావు, రామచంద్రపురం, ఆమదాలవలస మండలం
నాకు అరబస్తా యూరియా ఇచ్చారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి విడ్డూరం చూడలేదు. మా పొలానికి ఎంత యూరియా అవసరం అయితే అంతే కొనుగోలు చేసుకుంటాం కాని ఎక్కువ బస్తాలు తీసుకొని యూరియాని ఏం చేసుకుంటాం.
– ఇప్పిలి హేమంతరావు, పొన్నాంపేట, ఆమదాలవలస
యూరియా కోసం రైతు లు అనేక తిప్పలు పడుతున్నారు. ఒక్క బస్తా కోసం తెల్లవారి నుంచి క్యూ కడుతున్నారు. తక్కువ భూమి ఉన్న రైతులకు యూరియా ఇవ్వడం లేదు. రైతులను జతకట్టి యూరియా ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ చూడలేదు.
– కె.రామరాజు, రైతు, యలమంచిలి,
కోటబొమ్మాళి మండలం.
యూరియా కోసం రైతుల్ని ఇబ్బందులు పెట్టడం సరికాదు. భూమి ఉన్న వారికే సక్రమంగా యూరియా ఇవ్వడం లేదు. కౌలు రైతుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. యూరియా కోసం రైతులు చాలా అవస్థలు పడుతున్నారు.
– ఎన్.షణ్ముఖరావు,
రైతు సంఘం నాయకుడు, టెక్కలి


