వజ్రపుకొత్తూరు రూరల్: ప్రజా కళల పరిరక్షణ కోసం, ఉత్తరాంధ్ర సంస్కృతిని చాటి చెప్పేందుకు ఈ నెల 4న పల్లిసారథిలో ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న ప్రజా వాగ్గేయకారుడు, ప్రజాకవి వంగపండు ప్రసాద్ స్మారక సభను విజయవంతం చేయాలని ఉత్తరాంధ్ర ప్రజా గొంతుక ప్రతినిధులు, ప్రజా సంఘ నాయకులు, ఉద్దాన కళాకారులు పిలుపునిచ్చారు. ఈ మేరకు పల్లిసారథిలో ఆదివారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వంగపండు ప్రసాద్ తన రచనలు, పాటలతో సమాజంలో చైతన్యం నింపారని కొనియాడారు. ఆయన ఆశయాలను భావితరాలకు పరిచయం చేయడంతో పాటు ఉత్తరాంధ్ర సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వంగపండు సహచరుడు సంజీవ్, కుమారుడు దుష్యంత్, సినీ నటుడు ఆర్.నారాయణమూర్తితో పాటు ఉత్తరాంధ్ర సాహితీవేత్తలు, కళాకారులు, ప్రజా సంఘాల నాయకులు హాజరుకానున్నట్లు వారు తెలిపారు.
పాముకాటుకు మహిళ
మృతి
పోలాకి: మండలంలోని డోల గ్రామానికి చెందిన మహిళ దువ్వారపు నారాయణమ్మ(49) పాముకాటుకు గురై చికిత్సపొందుతూ మృతిచెందింది. మృతురాలి కుమారుడు గవరయ్య ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల మేరకు.. నారాయణమ్మ శనివారం ఉదయం పొలం పనులకు వెళ్లగా.. అక్కడ పాము కాటు వేసింది. గాట్లను గుర్తించి వెంటనే పోలాకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, అక్కడి నుంచి నరసన్నపేట ఏరియా ఆస్పత్రికి, అక్కడి నుంచి శ్రీకాకుళం రిమ్స్‌కు వైద్యులు రిఫర్ చేశారు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.


