● నిబంధనలకు పాతర ● గతంలో మీనాక్షి.. ఇప్పుడు శ్రీకాంత్ ● జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు సేవలో 30 మంది వైద్యులు
ఈ ప్రైవేటు ఆస్పత్రి బోర్డు చూశారా. డాక్టర్ తాడేల శ్రీకాంత్ నేమ్‌బోర్డుతో నరసన్న పేట నేషనల్ హైవేలో భారీగా కనిపించేలా ప్రైవేటు ఆస్పత్రి నిర్వహిస్తున్నారు. అడిషనల్ డీఎంహెచ్‌ఓ హోదాలో ఉన్న ఈ వైద్యాధికారి ప్రస్తుతం జిల్లా వైద్యారోగ్యశాఖలో ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓగా విధుల్లో ఉన్నారు. ఇలాంటి బోర్డులు పెట్టుకుని ఇంత డైరెక్ట్‌గా జిల్లా స్థాయి అధికారులే నిబంధనలకు పాతర వేస్తుంటే.. ఇక మిగిలిన స్థాయి వైద్యుల సంగతి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.
అరసవల్లి:
ప్రభుత్వ రంగంలో వైద్యులుగా పనిచేస్తున్న వారు కేవలం ప్రభుత్వాస్పత్రుల్లోనే పని చేయాలి. దీనిపై ప్రభుత్వాలు ప్రత్యేక జీఓలు కూడా వెలువరించాయి. గతంలో 1987కి ముందు నియమితులైన వైద్యులను మినహాయిస్తూ.. మిగిలిన వైద్యుల్లో ముఖ్యంగా పరిపాలనా వ్యవహారాలు నిర్వర్తించే వైద్యాధికారులెవ్వరూ ప్రైవేటు ప్రాక్టీస్ చేయరాదంటూ 2006లో స్పష్టమైన జీఓ 119ని విడుదల చేశారు. అలాగే 2022లో కూడా ఇదే నిబంధనలతో జీఓ 450ని విడుదల చేశారు. ఈ జీఓల ప్రాప్తికి వైద్యారోగ్య శాఖలో పరిపాలనాధికారులు నిర్వర్తిస్తున్న వైద్యాధికారులు, సామాజిక, ప్రాంతీయ వైద్య ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యులు ఎలాంటి ప్రైవే టు క్లినిక్‌ల్లో పనిచేయరాదు. వైద్యారోగ్య శాఖ ఉద్యోగుల కండక్ట్ రూల్స్‌లో ఇదో కీలక నిబంధనగా పేర్కొన్నారు. కానీ జిల్లాలో వైద్యాధికారులు యథేచ్ఛగా ప్రైవేటుగా ప్రాక్టీసు చేసుకుంటున్నా రు. ప్రభుత్వ ఆస్పత్రుల పనివేళల్లో కూడా వీరు విధులను ఎగ్గొట్టి ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్స్ వేసుకుని వచ్చేసి ఎంచక్కా ప్రైవేటు ఆస్పత్రుల్లో కాసులు సంపాదించుకుంటున్నారు. ప్రైవేటు క్లినిక్‌ల్లో తమ నేమ్ బోర్డులతోనే స్వేచ్ఛగా ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. ప్రత్యేక అలవెన్సులను కూ డా ప్రభుత్వం కేటాయిస్తున్న క్రమంలో ఇలా ప్రైవేటు క్లినిక్‌ల నిర్వహణ పూర్తిగా నిబంధనలకు విరుద్ధమే. దీనిపై కూటమి ప్రభుత్వం మాత్రం ఎలాంటి నియంత్రణ చర్యలు చేపట్టకపోవడంపై జనం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
దాదాపు ముప్పై మంది వైద్యులు
జిల్లాలో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో సీనియర్ వైద్యులుగానూ, వైద్యాధికారులుగా కూడా పనిచేస్తున్న వైద్యులు యథేచ్ఛగా ప్రైవేటు క్లినిక్‌లను నడుపుతున్నారు. జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి హోదాల్లో గతంలో జిల్లాలో పనిచేసిన బొడ్డేపల్లి మీనాక్షి కూడా డీఎంహెచ్‌ఓ హోదాలో ఉంటూనే జిల్లా కేంద్రంలో తన ప్రైవేటు గైనిక్ విభాగ ప్రాక్టీస్‌కు అధిక సమయం కేటాయించేవారనే విమర్శలున్నాయి. అదే కోవలో జిల్లా అడిషినల్ డీఎంహెచ్‌ఓ హోదాతో పాటు ప్రోగ్రాం ఆఫీసర్ గా పనిచేస్తున్న డాక్టర్ తాడేల శ్రీకాంత్..(ప్రస్తుత ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ) కూడా నరసన్నపేటలో ఓ ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు. అలాగే కీలక ఆరోగ్య సేవలందించాల్సిన ప్రాంతాలైన పాతపట్నం, కోటబొమ్మాళి సీహెచ్‌సీల్లో పనిచేస్తున్న సూపరింటెండెంట్లు కూడా ప్రైవేటు క్లినిక్‌లకు అధిక సమయాన్ని వెచ్చిస్తున్నారనే విమర్శలున్నాయి. ఇలా గే జిల్లా వ్యాప్తంగా ప్రత్యక్షంగా 19 మంది ప్రభుత్వ వైద్యులు, పరోక్షంగా 11 మంది వరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తూ ప్రైవేటు క్లినిక్‌లు నడుపుతున్నారని విశ్వసనీయ సమాచారం. కొందరైతే ఏకంగా శ్రీకాకుళం, నరసన్నపేట, టెక్కలి, పలాస తదితర పట్టణాల్లో పెద్ద పెద్ద ఆస్పత్రులు నిర్మించుకుని పెద్ద పెద్ద హోర్డింగ్‌లో పేర్లతోనే వాటిని నడుపుతున్నారు. వీటి అనుమతులు కూ డా డీఎంహెచ్‌ఓ కార్యాలయ విభాగమైన డెమో నుంచే పొందుతున్నారు. ఆస్పత్రులను తనిఖీ చేసే అధికారమున్న ఈ విభాగాధికారులు ఇంతవరకు జిల్లాలో ప్రభుత్వ వైద్యుల ప్రాక్టీస్‌లపై ఎలాంటి నోటీసులు జారీ చేయలేదు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి ప్రభుత్వ వైద్యులకు ప్రైవేటు ప్రాక్టీస్ రద్దుపై ప్రభుత్వ ఉత్తర్వులను కఠినంగా అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.


