అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం
ప్రభుత్వం సాయం అందించాలి
● నేటి నుంచి శ్రీకాకుళంలో బ్యాడ్మింటన్ టోర్నీ ● సీనియర్స్ పురుషులు, మహిళల విభాగాల్లో జరగనున్న పోరు ● ముమ్మరంగా ఏర్పాట్లు
శ్రీకాకుళం న్యూకాలనీ: సిక్కోలు వేదికగా మరో బ్యాడ్మింటన్ స్టేట్ మీట్‌కు రంగం సిద్ధమైంది. భాయ్, ఏపీబీఏ సహకారంతో శ్రీకాకుళం జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం వేదికగా ఆదివారం నుంచి నాలుగు రోజులపాటు జరగనున్న ఏపీ రాష్ట్రస్థాయి (అంతర్ జిల్లాల) సీనియర్స్ పురుషులు, మహిళల బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్–2026 పోటీలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వివిధ జిల్లాల నుంచి హాజరయ్యే షట్లర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వహణ కమిటీ ప్రతినిధులు ప్రతిష్టాత్మకంగా భావించి ఏర్పాట్లు చేస్తున్నారు. పోటీలకు ఆతిథ్యమిస్తున్న స్థానిక శాంతినగర్‌కాలనీలో ఉన్న డీఎస్‌ఏ ఇండోర్ స్టేడియంను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. టోర్నీ విజయవంతం కోసం అనేక కమిటీలను నియమించి, వారంతా వారివారి పనుల్లో నిమగ్నమయ్యారు. ఏర్పాట్లపై జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ చైర్మన్ ఆర్.రాజేంద్రన్, జిల్లా అధ్యక్షుడు, ఏపీబీఏ ఉపాధ్యక్షుడు కిల్లంశెట్టి సాగర్, చీఫ్ ప్యాట్రన్ డాక్టర్ గూడేన సోమేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి మెట్ట అశోక్‌కుమార్, కార్యనిర్వాహక కార్యదర్శి నారాయణశెట్టి వెంకట కిరణ్‌కుమార్, సీఈవో సంపతిరావు సూరిబాబు, జిల్లా ఉపాధ్యక్షుడు భైరి దామోదరరావు, మదీనా శైలానీ, ఎంఈ రత్నాజీ, గురుగుబెల్లి ప్రసాద్, మెండ శాంతికుమార్, అనిల్‌కుమార్ తదితరులు శనివారం సాయంత్రం సమీక్షించారు.
నేడు క్వాలిఫైయింగ్ రౌండ్స్
ఈ మెగా బాడ్మింటన్ టోర్నీలో భాగంగా ఆదివారం మొదటి రోజు క్వాలిఫైయింగ్ రౌండ్స్ నిర్వహిస్తుండగా, 3వ తేదీ నుంచి 5 వరకు మూడు రోజులపాటు మెయిన్ డ్రా పోటీలను జరపనున్నారు. మొత్తం 5 కేటగిరీల్లో పోరు కొనసాగనుంది. సీనియర్స్ విభాగంలో పోటీలు కావడంతో ఆద్యాంతం హోరాహోరిగా– ఉత్కంఠగా సాగనుండటం ఖాయమని నిర్వాహకులు భావిస్తున్నారు. ఇక్కడ గెలుపొందిన క్రీడాకారులు భువనేశ్వర్ వేదికగా త్వరలో జరిగే ఆలిండియా సీనియర్స్ బాడ్మింటన్ టోర్నీకి అర్హత సాధిస్తారని జిల్లా బాడ్మింటన్ చీఫ్ ప్యాట్రన్ డాక్టర్ గూడేన సోమేశ్వరరావు పేర్కొన్నారు.
జిల్లాకు చేరుకున్న షట్లర్లు
ఇదిలా ఉండగా ఈ బాడ్మింటన్ స్టేట్ మీట్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్న 13 జిల్లాల నుంచి 156 మంది నేరుగా హాజరవుతుండగా.. వీరితోపాటు మరో 52 మంది వరకు కోచ్ మేనేజర్లు హాజరవుతున్నారు. దాదాపుగా వీరంతా ఇప్పటికే జిల్లాకు చేరుకున్నారు. వీరికి స్థానికంగా హోటళ్లలో బస కల్పిస్తున్నారు. ఇండోర్ స్టేడియం వేదికగా భోజన ఏర్పాట్లు కల్పిస్తున్నారు. అలాగే క్వాలిఫైయింగ్ రౌండ్స్‌కు హాజరయ్యే క్రీడాకారుల్లో 1:4 నిష్పత్తిలో విజేతలుగా నిలిచిన షట్లర్లు మెయిన్ డ్రాకు అర్హత సాధిస్తారు. జిలానీ భాషా, సంపతిరావు సూరిబాబు రిఫరీలుగా వ్యవహరిస్తుండగా, టెక్నికల్ అఫీషియల్స్‌గా మరో 30 మంది హాజరవుతున్నారు.
ప్రభుత్వ సాయం శూన్యం
ఈ స్టేట్ బాడ్మింటన్ స్పోర్ట్స్ మీట్ నిర్వహణకు రూ.12 లక్షలకు పైగా వెచ్చించి ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాకు అపఖ్యాతి కలగకుండా.. ప్రభుత్వం తరుపున దమ్మిడి సాయం లేకపోయినా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం సాయం అందించగలిగితే క్రీడాకారులకు మరింత ఉన్నతస్థాయిలో వసతులు, సౌకర్యాలు కల్పించడానికి అవకాశం లభిస్తుందని క్రీడావర్గాలు భావిస్తున్నాయి.
నేటి నుంచి మొదలయ్యే ఏపీ రాష్ట్రస్థాయి బాడ్మింటన్ పోటీలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. జిల్లా కమిటీ అంతా సమష్టిగా టోర్నీ ఏర్పాట్లలో నిమగ్నమయ్యాం. జిల్లాకు హాజరయ్యే క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా. అందరూ సహకరించి విజయవంతం చేయాలి.
– కిల్లంశెట్టి సాగర్, బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు
శ్రీకాకుళం జిల్లాలో బాడ్మింటన్ స్టేట్‌మీట్ జరుగుతుండడం జిల్లాకు గర్వకారణమనే చెప్పాలి. ఈ టోర్నీకి సుమారు రూ.12 లక్షల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నాం. ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎక్కడా తగ్గకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. పోటీల నిర్వహణకు ప్రభుత్వం నుంచి కూడా సాయం అందించగలిగితే క్రీడాకారులకు మేలు జరుగుతుంది.
– నారాయణశెట్టి వెంకట కిరణ్‌కుమార్,
స్టేట్‌మీట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ


