వంశధార కాలువపై ఆక్రమణలు | - | Sakshi
Sakshi News home page

వంశధార కాలువపై ఆక్రమణలు

Aug 2 2026 12:46 AM | Updated on Aug 2 2026 12:46 AM

నందిగాం: మండలంలోని వంశధార ఎడమ ప్రధాన కాలువ గట్టుపై పలుచోట్ల ఆక్రమణలు చోటు చేసుకుంటున్నా అధికారులు వాటివైపు కన్నెత్తి చూడడం లేదు. ముఖ్యంగా పెద్దతామరాపల్లి, గొల్లూరు పరిధిలో ఉన్న గట్టుపై పలువురు ఆక్రమించి గట్టును చదును చేసి కొన్నిచోట్ల వివిధ రకాల మొక్కలు నాటుకుంటున్నారు. అలాగే వాటికి కంచెలు ఏర్పాటు చేసి గట్టుపై వెళ్లే మార్గం లేకుండా చేస్తున్నారు. ఈ ఆక్రమణలు ఇలాగే కొనసాగితే కాలువ గట్టు బలహీనపడే ప్రమాదం ఉంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో గట్టు ఆక్రమణలు జరగకుండా, నీరు గట్టుపైకి రాకుండా గొల్లూరు నుంచి పెద్దతామరాపల్లి సూపర్‌ ప్యాసేజ్‌ వరకు గట్టుపై రహదారి నిర్మాణం చేశారు. అయితే మరలా ఇటీవల గట్టు ఆక్రమణలకు గురవుతోంది. అందువలన వంశధార అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు

పాతపట్నం: మండలంలోని జంతిగూడ గ్రామ సమీపంలో ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ద్విచక్ర వాహనంతో ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జగ్గిలిబొంతుకు చెందిన ఘంటా కొండలరావు, ఘంటా సంజీవరావు, చింతాడ మురళీలు కలిసి పర్లాకిమిడి (ఒడిశా) నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్నారు. ఈ క్రమంలో జంతిగూడ గ్రామం వద్ద ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొనడంతో ముగ్గురికి తీవ్రగాయాలయ్యయి. వెంటనే స్థానికులు పర్లాకిమిడి ప్రభుత్వ ఆస్పత్రి తీసుకెళ్లారు. చింతాడ మురళీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్‌ఐ కె.శ్రీరామమూర్తి తెలిపారు.

ముగిసిన ఏకపాత్రాభినయ పోటీలు

శ్రీకాకుళం కల్చరల్‌: శ్రీకాకుళ రంగస్థల కళాకారుల సమాఖ్య (నెలవారీ సాంస్కృతిక విభాగ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 322వ నెల కార్యక్రమంలో భాగంగా దివంగత పురుషోత్తం (భైరి) సూర్యనారాయణ మాస్టారు స్మారక రాష్ట్రస్థాయి పౌరాణిక, జానపద, సాంఘిక, పద్య ఏకపాత్రాభినయ పోటీలు శనివారం స్థానిక బాపూజీ కళామందిర్‌లో ఘనంగా ముగిశాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు తమ ఏకపాత్రాభినయ ప్రదర్శనలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. సాయంత్రం సమాఖ్య అధ్యక్షుడు డా.ఎల్‌.రామలింగస్వామి అధ్యక్షతన జరిగిన సభలో ప్రముఖ రంగస్థల పౌరాణిక నటులు పద్మశ్రీ యడ్ల గోపాలరావు, పి.లీలామోహన్‌ పాల్గొన్నారు. పోటీల్లో ప్రథమ బహుమతి నల్లపాటి అన్నపూర్ణ (చంద్రమతి), ద్వితీయ బహుమతి పుట్టా కృష్ణ (నక్షత్రకుడు), తృతీయ బహుమతి కాతా హరిబాబు (హరిశ్చంద్రుడు) పొందారు. విజేతలకు జ్ఞాపికలతో పాటు నగదు బహుమతులను అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement