సీపీఐ జిల్లా కార్యదర్శి
చాపర వెంకటరమణ
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): దేశ సమైక్యత, సమగ్ర అభివృద్ధి సాధనే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై సీపీఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా ఈనెల 6వ తేదీ నుంచి 15 వరకు ప్రచార పాదయాత్రలు చేపట్టనున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ తెలిపారు. నగరంలోని క్రాంతి భవన్‌లో విలేకరుల సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 12 ఏళ్లైనా ప్రజా సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందని దుయ్యబట్టారు. సీబీఐ, ఈడీ లాంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుటోందని మండిపడ్డారు. మద్దతు ధర విషయంలో రైతులపై కనికరం చూపకుండా, గిట్టుబాటు ధరకు చట్టబద్ధత కల్పించకుండా వ్యవసాయాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టి రైతులను కట్టు బానిసలుగా మార్చాలని చూస్తున్నారన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా అమ్ముతున్నారని పేర్కొన్నారు. వరుస పేపర్ లీకేజీలతో లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయోధ్య రామ మందిరంలో రూ.200 కోట్ల దోపిడీ జరిగినా ఎందుకు పట్టుకోలేదని నిలదీశారన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం పూర్తి, రాజధాని నిర్మాణం, కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం వంటివి ఇంతవరకు సాధించలేకపోయిన అసమర్థ సీఎం అని దుమ్మెత్తిపోశారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని, వంశధార ఆఫ్‌షోర్ నిర్వాసితులకు న్యాయం చేయాలని, కార్గో ఎయిర్‌పోర్టుకి బలవంతపు భూసేకరణ ఆపాలని కోరారు. సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యుగంధర్, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి వెంకటరావు, జిల్లా కార్యవర్గ సభ్యుడు శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.


