టెక్కలి రూరల్: మండలంలో ఒలియాసాగరం సమీపంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద బుధవారం ఒక లగేజీ ఆటో బోల్తాపడింది. స్థానికులు తెలిపిన వివరాలు మేరకు.. టెక్కలి నుంచి శ్యాంసుందరాపురం వైపు ఐరన్ లోడుతో వెళ్తున్న ఆటో ఫ్లైఓవర్ బ్రిడ్జిపైకి వెళ్లేందుకు అప్రోచ్ రోడ్డులోకి మలుపు తిరుగున్న సమయంలో, రహదారి పూర్తిగా పాడైపోవడంతో ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్నవారికి ఎటువంటి ప్రమాదం జరగలేదు.
పశువుల అక్రమ రవాణా
మందస: మండలంలోని బాలిగాం సమీపంలో ఉన్న జాతీయ రహదారిపై బుధవారం ఉదయం అక్రమంగా పశువులు రవాణా చేస్తున్న రెండు వాహనాలను స్థానిక ఎస్‌ఐ కె.కృష్ణప్రసాద్ పట్టుకున్నారు. బరంపురం నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న రెండు వాహనాలను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
ప్రధాని సభను
విజయవంతం చేయాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆగస్టు 1వ తేదీన భోగాపురంలో నిర్వహించనున్న ప్రధాని నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబుల సభను విజయవంతం చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. బుధవారం మండల స్థాయి అధికారులతో నిర్వహించిన సమీక్షలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సభకు వెళ్లే వారికోసం 737 బస్సులు ఏర్పాటు చేశామని, ప్రయాణికులకు ఇచ్ఛాపురం నుంచే వేడివేడిగా టిఫిన్లు అందించేందుకు 19 కేంద్రాలను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఆహారం అందలేదనే ఫిర్యాదు రాకుండా హెచ్‌డీటీలు పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ఏ రూట్ బస్సు అదే రూట్‌లో వెళ్లాలని, ఎక్కడా నిలపరాదని పేర్కొన్నారు. మధ్యాహ్నం 35 వేల మందికి 9 పాయింట్లలో భోజనాలు సిద్ధం చేస్తున్నామని వివరించారు. భోజన కేంద్రాల వద్ద నియోజకవర్గాల పేర్లతో పెద్ద బ్యానర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అత్యవసరమైతే తప్ప బస్సులను మధ్యలో ఆపవద్దని, బస్సు ఇన్‌చార్జిలు పూర్తి బాధ్యతలు తీసుకోవాలన్నారు. సందేహాల నివృత్తికి కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని సూచించారు.
ఆగిన మట్టి తరలింపు
సంతబొమ్మాళి: మండలంలోని రుంకు హనుమంతుపురం రెవెన్యూ పరిధిలో ఉన్న పెద్ద చెరువులో మట్టిని టిప్పర్ల ద్వారా అక్రమంగా తరలించడాన్ని రెవెన్యూ అధికారులు నిలుపుదల చేశారు. చెరువు మట్టి కొల్లగొట్టి అనే శీర్షికతో సాక్షి దినపత్రికలో బుధవారం కథనం ప్రచురితం కావడంతో రెవెన్యూ అధికారులు స్పందించారు. తహసీల్దార్ హేమసుందరరావు ఆదేశాల మేరకు స్థానిక వీఆర్వో శంకర్ ఘటనా స్థలానికి వెళ్లి, పెద్ద చెరువులో మట్టి తవ్వకాలను పరిశీలించారు. అనంతరం నిలుపుదల చేశారు.


