వజ్రపుకొత్తూరు రూరల్: పలాస మండలం సుబ్బగుడ్డి గ్రామ పరిసరాల్లో ఉన్న ప్రభుత్వ కొండ పోరంబోకు కాలువ కబ్జాకు గురయ్యిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొండపై కురిసే వరద నీరు సహజంగా కాలువ ద్వారా దిగువకు ప్రవహిస్తూ ఎర్ర చెరువులోకి చేరుతుంది. దీంతో భూగర్భ జలాలు పెరగడంతో సమీప అటవీ ప్రాంతం నుంచి వచ్చే అడవి జంతువుల దాహార్తిని తీర్చడంతో పాటు పంటసాగుకు ఈ చెరువు ఎంతో ఆధారంగా ఉంటుందని వారు చెబుతున్నారు. అయితే ఈ కాలువను కూటమి నాయకుల అండదండలతో కొంతమంది కబ్జా చేసి, మట్టితో కప్పి పొలాలుగా మార్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనివలన వరద నీరు ఎర్ర చెరువుకు చేరే అవకాశం ఉండదని, దీంతో పర్యావరణానికి ముప్పుతో పాటు మూగజీవాలకు, పంటలకు నీరు అందని పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అందువలన ప్రజాప్రతినిధులు, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు స్పందించి కబ్జాలను తొలగించి ప్రభుత్వ భూములను పరిరక్షించాలని కోరారు. ఈ విషయంపై తహసీల్దార్ శ్రీదేవి వివరణ కోరగా.. కొండ కాలువ ఆక్రమణ విషయం తమ దృష్టికి రాలేదని, వెంటనే రెవెన్యూ సిబ్బందిని పంపించి క్షేత్రస్థాయిలో విచారణ చేపడతామన్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవని పేర్కొన్నారు.


