ఐషీఘోష్‌ అరెస్టుకు యత్నించడం సరికాదు | - | Sakshi
Sakshi News home page

ఐషీఘోష్‌ అరెస్టుకు యత్నించడం సరికాదు

Jul 30 2026 1:09 AM | Updated on Jul 30 2026 1:09 AM

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) అఖిల భారత సహాయ కార్యదర్శి ఐషీ ఘోష్‌ను అరెస్ట్‌ చేయడానికి ఢిల్లీ పోలీసులు చేస్తున్న ప్రయత్నాలను ఎస్‌ఎఫ్‌ఐ శ్రీకాకుళం జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు శ్రీకాకుళం నగరంలోని గవర్నమెంట్‌ ఆర్ట్స్‌ కాలేజీ గేటు ఎదుట నిరసన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు డి.చందు, ఎస్‌ఎఫ్‌ఐ కార్యదర్శి పి.ఖగేష్‌లు మాట్లాడుతూ నీట్‌ పరీక్షల్లో జరిగిన అవకతవకలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద నిర్వహించిన దేశవ్యాప్త విద్యార్థి ఉద్యమానికి ఐషీ ఘోష్‌ కీలక నాయకత్వం వహించారన్నారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌ కోసం, పారదర్శకమైన పరీక్షా వ్యవస్థ కోసం ఆమె నిరంతరం పోరాడారన్నారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం ముందుండి పోరాటం చేసిన నాయకురాలిని లక్ష్యంగా చేసుకుని పాత కేసులను తిరిగి తెరపైకి తీసుకొచ్చి అరెస్ట్‌ చేయడానికి ప్రయత్నించడం రాజకీయ కక్షసాధింపుగా కనిపిస్తోందని ఆరోపించారు. కేసులతో విద్యార్థుల గొంతును మూసివేయాలని చూసే ప్రయత్నాలు ఎన్నటికీ విజయవంతం కావన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును హరించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. పోలీసులు చట్టానికి, రాజ్యాంగానికి మాత్రమే విధేయులై పనిచేయాలని సూచించారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు ఎస్‌ఎఫ్‌ఐ పోరాటం నిరంతరం కొనసాగుతుంది హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా గర్‌ల్స్‌ కన్వీనర్‌ పి.దివ్య, ఆర్ట్స్‌ కాలేజీ కమిటీ సభ్యులు ధరణి, శిరీష, దుర్గ భవానీ, హాస్టల్‌ కమిటీ సభ్యులు దివాకర్‌, కార్తీక్‌, అజిత్‌, విద్యార్థులు తరుణ్‌, జగదీష్‌, హేమంత్‌, జగన్‌, మురళి, పవన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement