ఇచ్ఛాపురం: స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో గంజాయిని అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు సీఐ మీసాల చిన్నంనాయుడు తెలిపారు. ఈ మేరకు బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఒడిశా రాష్ట్రంలోని గంజాం జిల్లా సర్దాపూర్ గ్రామానికి చెందిన అనిల్‌కుమార్ గౌడ, పొలసర జిల్లా డెంగాపదర గ్రామానికి చెందిన మున్నా ప్రదాన్ అనే ఇద్దరు యువకులు ఒడిశాలోని బహరగుడకి చెందిన గంజాయి వ్యాపారి కుంజోజెనా సూచించినట్లు గంజాయి అక్రమ రవాణాకు పూనుకున్నారు. దీంతో మొత్తం 34.290 కేజీల గంజాయిని గుజరాత్ రాష్ట్రంలోని గంగా మహంతికి అందజేయడానికి బరంపురం రైల్వేస్టేషన్‌కి సోమవారం చేరుకున్నారు. అక్కడ పోలీసుల తనిఖీలు ఎక్కువగా ఉండడంతో వారిరువురు రెండు రోజులపాటు అక్కడే ఉండిపోయారు. అనంతరం బుధవారం ఒడిశా నుంచి బస్‌లో ఇచ్ఛాపురం చేరుకున్నారు. రైలులో గుజరాత్ వెళ్లడానికి ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్‌కి వస్తుండగా స్టేషన్ సమీపంలో తనిఖీలు నిర్వహిస్తున్న పట్టణ పోలీసులకు గంజాయితో పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి ఒక సెల్‌ఫోన్, గంజాయిని స్వాధీనం చేసుకొని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడంలో క్రియాశీలకంగా వ్యవహరించిన పట్టణ పోలీసులను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించినట్లు సీఐ తెలిపారు. కార్యక్రమంలో పట్టణ ఎస్‌ఐ ఎం.ముకుందరావు, సిబ్బంది పాల్గొన్నారు.


