● టెక్కలిలో మార్ఫింగ్ స్టాంప్
పేపర్ల కలకలం
● ఆన్‌లైన్ కేంద్రంలో రూ.100 విలువ కలిగిన వెస్ట్ బెంగాల్ స్టాంప్ పేపర్లు స్వాధీనం
● ఆంధ్రప్రదేశ్ పేరును మార్ఫింగ్ చేస్తూ అమ్మకాలు
● పోలీసుల అదుపులో ఆన్‌లైన్ కేంద్రం నిర్వాహకుడు
టెక్కలి: టెక్కలిలో వేరే రాష్ట్రానికి చెందిన పలు నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్లపై ఆంధ్రప్రదేశ్ పేరును మార్చి విక్రయిస్తున్న ఓ ఆన్‌లైన్ కేంద్రం నిర్వాహకుడు పట్టుబడ్డాడు. దీంతో మంగళవారం పట్టణంలో కలకలం రేగింది. టెక్కలిలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి కొద్ది దూరంలో అంబేడ్కర్ జంక్షన్ నుంచి రైల్వే స్టేషన్‌కు వెళ్లే మార్గంలో సాయి భవానీ ఆన్‌లైన్ సెంటర్ నిర్వాహకుడు సురేందర్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రం కోల్‌కతాకు చెందిన రూ.100 విలువ కలిగిన స్టాంప్ పేపర్ పై ఆంధ్రప్రదేశ్ పేరును మార్ఫింగ్ చేసి అమ్మకాలు చేస్తున్న విష యం బయట పడింది. దీంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఇన్ చార్జి సబ్ రిజిస్ట్రార్ జయమ్మ నేతృత్వంలో ఆన్‌లైన్ కేంద్రంలో తనిఖీలు నిర్వహించి 100, 50, 20 రూపాయల విలువ కలిగిన సుమారు 24 స్టాంప్ పేపర్లను స్వాధీనం చేసుకున్నారు. ఆన్ లైన్ కేంద్రం నిర్వాహకుడు సురేందర్‌ను టెక్కలి పోలీ సులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఈ స్టాంప్ పేపర్‌పై స్థానికం కాని జె.వైకుంఠరావు అనే వెండర్ పేరుతో మరో విధంగా మార్ఫింగ్ చేశారు. ప్రస్తుతానికి పట్టుబడిన సురేందర్‌కు గతంలో ఈ–స్టాంప్ అమ్మకాల లైసెన్స్ ఉండేది. అయితే కొన్ని రకాల తప్పిదాలు చేయడంతో ఆ లైసెన్స్‌ను ప్రస్తుతం నిలిపివేశారు.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో గత కొన్ని నెలలుగా రూ.100 స్టాంప్ పేపర్‌లు అందుబాటులో లేకపోవడంతో ఇలాంటి మార్ఫింగ్ స్టాంప్ పేపర్లు పుట్టుకొచ్చాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో ఇలాంటి స్టాంప్ పేపర్ల ను విక్రయించినట్లు తెలుస్తోంది. ఒక్కో స్టాంప్ పేపర్‌ను అదనపు ధరలకు విక్రయించినట్లు సమాచారం. ఘటనలపై జిల్లా సబ్ రిజిస్ట్రార్ సంజీవయ్య టెక్కలి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరుకుని పరిస్థితులను తెలుసుకున్నారు. అయితే ఈ స్టాంప్ పేపర్లు మార్ఫింగ్‌పై స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసే విషయంలో జాప్యం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సంఘటనపై స్థానిక ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్ జయమ్మ మాట్లాడుతూ వెస్ట్‌బెంగాల్‌కు చెందిన స్టాంప్ పేపర్లను స్వాధీనం చేసుకున్నామని, ఆయా పేపర్లతో సహా ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు.


