రణస్థలం: భూముల్లో నిర్వహిస్తున్న రీసర్వేల్లో రైతులను భాగస్వాములను చేసేలా ముందుగానే సమాచారం అందించి వారి సమక్షంలోనే సర్వే నిర్వహించాలని, ఈకేవైసీ తప్పనిసరిగా నమోదు చేయాలని రాష్ట్ర సర్వే, సెటిల్‌మెంట్ అండ్ లాండ్ రికార్డ్స్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ అన్నారు. మండలంలోని సంచాం గ్రామంలో జరిగిన రీ సర్వేను ఆయన పరిశీలించారు. రైతులతో ముఖాముఖిగా సమావేశమై రీ సర్వే ప్రక్రియపై వారి అభి ప్రాయాలు, ఎదురవుతున్న సమస్యలు, భూ హద్దుల నిర్ధారణ, రికార్డుల కచ్చితత్వం, మ్యాప్‌ల సవరణ, భూ వివాదాల పరిష్కారం వంటి కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. రైతుల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తూ సర్వే పూర్తి చేయాలని సూచించారు. ఈ తనిఖీలో సహాయ సంచాలకులు ఎం.జోషిలా, శ్రీకాకుళం, టెక్కలి డివిజన్ సర్వే ఇన్‌స్పెక్టర్లు దుర్గాప్రసాద్, చంద్రశేఖర్, రణస్థలం తహశీల్దార్ సనపల కిరణ్ కుమార్, మండల సర్వేయర్ ఎస్. రవి, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.


