చెరువు మట్టి.. కొల్లగొట్టి..! | - | Sakshi
Sakshi News home page

చెరువు మట్టి.. కొల్లగొట్టి..!

Jul 29 2026 2:04 AM | Updated on Jul 29 2026 2:04 AM

యథేచ్ఛగా చెరువులో అక్రమంగా మట్టి తవ్వకాలు

మూడు టిప్పర్లతో తరలిస్తున్న వైనం

పట్టించుకోని అధికారులు

సంతబొమ్మాళి: మండలంలో అధికార పార్టీ నాయకులు బరితెగిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి అనుమతులు లేకపోయినా చెరువు మట్టిని అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. రుంకు హనుమంతుపురం రెవెన్యూ పరిధి సర్వే నంబర్‌–1లో 70 ఎకరాల పెద్ద చెరువుపై స్థానిక అధికార పార్టీ నాయకుల కన్నుపడింది. చుట్టుపక్కల లే అవుట్లు పుట్టగొడుగుల మాదిరిగా రావడంతో వీరి పంట పండింది. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా నిబంధనలకు విరుద్ధంగా.. ఎటువంటి అనుమతులు లేకపోయినా పెద్ద చెరువు మట్టిని అమ్ముకోవడానికి సిద్ధమయ్యారు. అనుకున్నదే తడువుగా మంగళవారం పెద్ద చెరువులో మట్టిని తవ్వేందుకు రెండు యంత్రాలను ఏర్పాటు చేసి మూడు టిప్పర్లతో మట్టిని తరలించారు. దూరం ఆధారంగా లోడు మట్టిని రూ.1500ల నుంచి రూ.2 వేలు వరకు అమ్ముతున్నట్లు సమాచారం. ఇలా రోజుకు 100 లోడ్‌లు వరకు చెరువు మట్టిని తరలించే అవకాశం ఉంది. ఈ తరలించిన మట్టిని లే అవుట్లకు వినియోగిస్తున్నారని గ్రామస్తులు అంటున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినా ఏమీ తెలియనట్లు వ్యవహరించడంపై గ్రామస్తులు మండి పడుతున్నారు.

చెరువులోనే ఉపాధి పనులు

ఈ గ్రామానికి సంబంధించి ప్రతీ ఏడాది ఉపాధి పనులను పెద్ద చెరువులోనే కల్పించడం జరుగుతుంది. ఇక్కడ వందల సంఖ్యలో ఉపాధి హామీ వేతనదారులు పనులు చేస్తుంటారు. అలాంటి ఉపాధి హామీ చెరువులో యంత్రాలను వినియోగించి మట్టిని వేరొక చోటకు తరలించడం నిబంధనలకు విరుద్ధం. వాటిని కూడా అధికార పార్టీ నాయకులు ఉల్లంఘించి మట్టిని దర్జాగా అమ్ముకుంటున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

నా దృష్టికి వచ్చింది

పెద్ద చెరువులో మట్టిని తరలిస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. వెంటనే వీఆర్వో శంకర్‌ను పంపించాను. మట్టి తరలింపును నిలుపుదల చేయాలని చెప్పాను.

– హేమసుందరరావు, తహసీల్దార్‌, సంతబొమ్మాళి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement