వృద్ధురాలికి మాజీ సైనికుల చేయూత | - | Sakshi
Sakshi News home page

వృద్ధురాలికి మాజీ సైనికుల చేయూత

Jul 29 2026 2:04 AM | Updated on Jul 29 2026 2:04 AM

ఫైర్‌స్టేషన్‌ ఉద్యోగికి తీవ్రగాయాలు ఎరువుల కోసం రైతుల ధర్నా

శ్రీకాకుళం కల్చరల్‌: నగరంలోని జిల్లా పరిషత్‌ దగ్గర కంపోస్ట్‌ కాలనీ ద్వారకా నగర్‌లో నివాసముంటున్న వృద్ధురాలు సూరాలమ్మకు మాజీ సైనికులు చేయూతనందించారు. ఆమె కోసం ఒక ఇంటిని నియమించి డీఎస్పీ సీహెచ్‌ వివేకానంద చేతులమీదుగా మంగళవారం ప్రారంభించారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాకు చెందిన మాజీ సైనికుడు కాకర్ల నర్సింగ్‌ వృద్ధురాలి ఇబ్బందులు తెలుసుకొని చలించిపోయాడు. దీంతో అతని మన సిక్కోలు సైనికుడు ఇన్‌స్ట్రాగామ్‌ అకౌంట్‌ ద్వారా సాయం చేద్దామని పిలుపునిచ్చారు. ఈ మేరకు మాజీ సైనికులు, దాతలు విరాళాలు అందించారు. ఈవిధంగా సేకరించిన విరాళాలతో వృద్ధురాలికి ఒక తాత్కాలిక గృహం నిర్మించి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌, విశ్రాంత గ్రూప్‌ కెప్టెన్‌ పి.ఈశ్వరరావు, లయన్‌ నటుకుల మోహన్‌, పైడి మురళీధరరావు, సనపల రామకృష్ణ, ఎం.సింహాచలం, పైడి రామారావు, పి.చిన్నరావు, పి.వెంకటేశ్వరరావు, టి.శ్రీను, బి.శంకరరావు, దుర్గా భవానీ వెల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు కింతాడ సంతోష్‌ పాల్గొన్నారు.

సరుబుజ్జిలి: సరుబుజ్జిలి జంక్షన్‌ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో నందికొండ కాలనీకి చెందిన ఫైర్‌స్టేషన్‌ ఏఎస్‌ఐ గుజ్జల అప్పలరాజు మంగళవారం తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అప్పలరాజు ఎప్పటిలాగే ఆమదాలవలస ఫైర్‌స్టేషన్‌లో విధులు ముగించుకొని తన ఇంటికి మంగళవారం వెళ్తున్నారు. అదే సమయంలో శ్రీకాకుళం నుంచి కొత్తూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు సరుబుజ్జిలి జంక్షన్‌లో ఢీకొంది. ఈ ప్రమాదంలో అప్పలస్వామికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108లో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

కొత్తూరు: స్థానిక పీఏసీఎస్‌ వద్ద ఎరువులు కోసం రైతులు మంగళవారం ధర్నా చేపట్టారు. ఏపీసీఎస్‌కు 400 బస్తాల డీఏపీని వ్యవసాయ శాఖ కేటాయించింది. కేటాయించిన డీఏపీని మంగళవారం పీఏసీఎస్‌ సిబ్బంది రైతులకు యాప్‌ ద్వారా విక్రయించారు. ముందుగా డీఏపీ కొనుగోలు కోసం వచ్చిన రైతులకు వరుస క్రమంలో టోకెన్లు ఇచ్చారు. అయితే కొంతమంది మంది రైతులకు సాయంత్రం వరకు ఉన్నా ఎరువులు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. దీంతో రైతులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సిర్ల ప్రసాద్‌ ఆందోళన చేపట్టి సొసైటీ అధికారుల తీరుపై మండిపడ్డారు. ఎరువుల విక్రయంపై సొసైటీ అధికారి నాగరాజు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని ప్రసాద్‌ అన్నారు. విక్రయాల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపించారు. 300 బస్తాలకు టోకెన్లను రైతులకు ఇచ్చారని, అయితే టోకెన్లు ఇచ్చిన రైతులకు ఎరువులు ఇవ్వకుండా స్టాక్‌ అయిపోయిందని చెప్పడం సరికాదన్నారు. ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎదురుచూసినా డీఏపీ ఇవ్వలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సొసైటీ అధికారులు ఇష్టానుసారంగా ఎరువులు విక్రయించారన్నారు. లైన్‌లో ఉన్నవారికి ఎరువులు ఇవ్వకుండా నచ్చినవారికి ఎరువులు అమ్మకాలు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో కొత్తూరు, కర్లెమ్మతో పాటు పలు గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement