నకిలీ పత్రాలతో
శ్రీకాకుళం క్రైమ్ : నకిలీ పత్రాల ఆధారంగా మూడు కోట్ల విలువైన ప్రభుత్వ రిజర్వ్‌డ్ స్థలాన్ని ఆక్రమించుకునేందుకు చూసిన నిందితుల కుట్రను శ్రీకాకుళం రూరల్ పోలీసులు ఛేదించారు. ఇందులో 11 మంది ప్రమేయం ఉన్నట్లు గుర్తించామని, వీరిలో తొమ్మిది మందిని మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని సీఐ కె.పైడపునాయుడు పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఈ మేరకు సీఐ మీడియా సమావేశం నిర్వహించారు. వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని ఎస్‌బీఐ స్టాఫ్ కాలనీ లేఅవుట్‌లో 11 సెంట్ల ప్రభుత్వ రిజర్వ్‌డ్ స్థలాన్ని అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు అదే కాలనీలో వాచ్‌మెన్‌గా పనిచేసిన గార మండలం కొత్తూరు సిరిగాంకు చెందిన వజ్జ మల్లేషు కుటుంబ సభ్యులు, మరికొందరు వ్యక్తులు పథకం రచించారు. దీనిపై కాలనీ అధ్యక్షుడు పుప్పాల జగదీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్‌ఐ కేవీ సురేష్ దర్యాప్తు కొనసాగించగా అనేక విషయాలు బయటపడ్డాయి.
నకిలీ పత్రాల తయారీ ఇలా..
శ్రీకాకుళం తహసీల్దార్, ఇతర రెవెన్యూ అధికారుల పేర్లతో నకిలీ సంతకాలు, నకిలీ అధికారిక ముద్రలు (స్టాంపులు) ఉపయోగించి ఫేక్ ఈ మెయిల్ ఐడీలను క్రియేట్ చేసి తప్పుడు పొజిషన్ సర్టిఫికెట్లు రూపొందించినట్లు పోలీసులు గుర్తించారు. ఆ సర్టిఫికెట్‌లో వజ్జ రాజులమ్మ 15 ఏళ్లుగా ఆ స్థలాన్ని స్వాధీనంలో ఉన్నట్లు తప్పుడు వివరాలు నమోదు చేసి ఆ నకిలీ పత్రాన్ని ఆధారంగా చేసుకుని వజ్జ రమణమ్మకు అనుకూలంగా సేల్ డీడ్ తయారు చేసి స్థలాన్ని అక్రమంగా బదిలీ చేసేందుకు యత్నించినట్లు, ఆమదాలవలస మండలానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మొండేటి సురేష్ ఈ ఆక్రమణలో కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు. వజ్జ నాగరాజు, వజ్జ కల్యాణ్‌రామ్ తదితరులు ఈ వ్యవహారాన్ని నడిపారని, కొత్తూరు మండలం ఎన్ని రామన్నపేటకు చెందిన తిర్లంగి లక్ష్మణరావు, బమ్మిడి గ్రామానికి చెందిన వంబరవెల్లి శ్రీనివాసరావుల సహకారంతో నకిలీ పత్రాలు తయారు చేసే వ్యక్తులను సంప్రదించి రూ.3 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని కొంతమొత్తం చెల్లించారన్నారు. రిజిస్ట్రేషన్ చేసేందుకు ఆమదాలవలస రవికాంతపేటకు చెందిన డాక్యుమెంట్ రైటర్ మోదలవలస వేణుగోపాలరావు, ఇచ్ఛాపురం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ కారాపాటి అనిల్‌కుమార్, శ్రీకాకుళం మహలక్ష్మి నగర్ కాలనీకి చెందిన మహేష్ స్టిక్కరింగ్ సెంటర్ యజమాని కోసూరు మహేశ్వరరావులు సహకారాన్ని పొందేందుకు యత్నించినట్లు విచారణలో తేలిందన్నారు. వజ్జ రాములమ్మ, వజ్జ మల్లేషులను అరెస్టు చేయాల్సి ఉందని, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామని సీఐ పైడపునాయుడు వెల్లడించారు.
నకిలీ పత్రాలతో ప్రభుత్వ రిజర్వ్‌డ్ స్థలం ఆక్రమణ
నిందితుల గుట్టు రట్టు చేసిన రూరల్ పోలీసులు
11 మంది ప్రమేయం.. 9 మంది అరెస్టు


