వెదురు బొంగులు ఇప్పించాలి
భర్త పింఛన్ నాకు ఇవ్వడం లేదు
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ● పీజీఆర్‌ఎస్‌కు 167 వినతులు
శ్రీకాకుళం పాతబస్టాండ్: అర్జీదారుల నుంచి వచ్చే ప్రతీ ఫిర్యాదుకు త్వరితగతిన పరిష్కారం చూపాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్)ను సోమవారం నిర్వహించారు. దీనిలో భాగంగా ఆయన వివిధ శాఖల అధికారులతో కలిసి ప్రజల నుంచి నేరుగా వినతులను స్వీకరించారు. బాధితులు అందజేసిన వినతిపత్రాలను పరిశీలించి, వాటిని వెంటనే ఆయా శాఖల అధికారులకు అందించారు. నిర్ణీత గడువులోగా సమస్యలను పరిష్కరించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పీజీఆర్‌ఎస్ ద్వారా దాఖలు చేసిన అర్జీల పరిష్కార ప్రక్రియపై ప్రజలు తమ ఫీడ్‌బ్యాక్‌ను నమోదు చేసుకోవాలని కోరారు. పీజీఆర్‌ఎస్‌కు మొత్తం 167 వినతులు వచ్చాయి.
క్యూఆర్ కోడ్ ద్వారా తెలియజేయాలి
ఈ సందర్భంగా కలెక్టర్ పీజీఆర్‌ఎస్‌లో పిటిషన్ దాఖలు చేసిన అర్జీదారులు తమకు లభించిన పరిష్కారంపై సంతప్తిగా ఉన్నారో లేదో ప్రత్యేక క్యూఆర్ కోడ్ ద్వారా తెలియజేయవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా గానీ, పోర్టల్ లింక్ ద్వారా గానీ అర్జీదారులు తమ ఫీడ్‌బ్యాక్‌ను సులభంగా తెలియజేయవచ్చని స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారంలో పారదర్శకత పెంచడం, బాధ్యతారాహిత్యాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా ఈ ఫీడ్‌బ్యాక్ వ్యవస్థను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.
వెదురు పరికరాల అల్లికకు వెదురు బొంగులను ప్రభుత్వం ఇప్పించాలని మేదర కులస్తులు కోరారు. ఈ మేరకు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. అటవీ శాఖ నూతన ఉత్తర్వులతో ఉపాధి కోల్పోతున్నామని, వృత్తిదార్లుకు ప్రాముఖ్యత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బొంగులు లేకపోవడం వలన బుట్టలు, గంపలు, తట్టలు, చాపలు, వ్యవసాయ అవసరాలకు ఉపయోగించే వస్తువులు, గృహోపకరణాలు, అలంకరణ వస్తువుల తయారీకి ఇబ్బందులు తప్పడం లేదని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా మేదర సంఘం సభ్యులు దాలినాయుడు, ధర్మారావు తదితరులు కోరారు.
కోటబొమ్మాళి మండలం అక్కయ్యవలస గ్రామానికి చెందిన కోళ్ల నర్సమ్మ భర్త ఎండన్న 2024 మార్చిలో మృతి చెందారు. అనంతరం అతని పెన్షన్‌ను తనకు మంజూరు చేయాలని నర్సమ్మ దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇప్పటికీ తనకు పింఛన్ రావడం లేదని ఆమె ఫిర్యాదు చేశారు. ఎంపీడీవో స్థాయిలో ఆమోదం లభించినప్పటికీ ఇప్పటివరకు పెన్షన్ మంజూరు కాలేదని, అధికారుల నిర్లక్ష్యం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.


