కేఆర్ స్టేడియం వేదికగా కొన్న
చిన్నారావు మెమోరియల్ అథ్లెటిక్స్ పోటీలు
జిల్లా సర్వసభ్య సమావేశంలో నిర్ణయం
విజయంతం చేయాలి
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా కేంద్రంలో నిర్వహించే దివంగత కొన్న చిన్నారావు మెమోరియల్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీలకు కౌంట్‌డౌన్ మొదలైంది. కొన్న చిన్నారావు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు గత 17 ఏళ్ల నుంచి ప్రతిఏటా స్పోర్ట్స్‌మీట్‌ను నిర్వహిస్తున్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు చిన్నారావు కుటుంబ సభ్యులు కొన్న వెంకటేశ్వరరావు(వాసు), కొన్న మధుసూదనరావు, ప్రగాడ అశోక్‌కుమార్, పూడి బాలాదిత్య ఆధ్వర్యంలో నౌపడ విజయ్‌కుమార్, మెంటాడ సాంబమూర్తి, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ పర్యవేక్షణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతిఏటా నిర్వహించే ఈ పోటీలను, ఈ ఏడాది ఆగస్టు 2వ తేదీన నిర్వహించాలని తీర్మానించారు. ఈ మేరకు శ్రీకాకుళంలోని జిల్లా స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ కార్యాలయంలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో అథ్లెటిక్స్ సంఘ ప్రతినిధులు, పీడీ, పీఈటీలు, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.
కేఆర్ స్టేడియం వేదికగా..
ఈ పోటీలను శ్రీకాకుళంలోని కోడిరామ్మూర్తి స్టేడియం వేదికగా నిర్వహించనున్నారు. ఈ అథ్లెటిక్స్ మీట్ టోర్నమెంట్ కమ్ సెలక్షన్ ట్రయల్స్‌లో నాలుగు వయో విభాగాల్లో పోటీలను జరపనున్నారు. అండర్–14, 16, 18, 20 విభాగాల్లో బాలబాలికలకు వేర్వేరుగా పోటీలను నిర్వహించి విజేతలుగా నిలచినవారికి పతకాలు అందజేయనున్నారు. పోటీలకు హాజరైన క్రీడాకారులు, టెక్నికల్ అఫీషియల్స్, వలంటీర్లు తదితరులకు పోటీలు జరిగే ప్రాంగణం వద్ద అన్ని వసతులతోపాటు భోజన ఏర్పాట్లు సైతం కల్పించనున్నారు. మొదటి స్థానాల్లో నిలిచిన అథ్లెట్స్ త్వరలో తిరుపతి వేదికగా జరిగే ఏపీ రాష్ట్రస్థాయి (అంతర్ జిల్లాల) జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీలకు నేరుగా అర్హత సాధించనున్నారు. ఈ పోటీల కోసం గత కొన్నాళ్ల నుంచి అథ్లెటిక్స్ క్రీడాకారులు కఠోర సాధన చేస్తున్నారు.
మా నాన్నగారు కొన్న చిన్నారావు జ్ఞాపకార్థం ప్రతిఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా అథ్లెటిక్స్ మీట్ నిర్వహిస్తున్నాం. ఆగస్టు 2వ తేదీన కోడి రామ్మూర్తి స్టేడియం వేదికగా పోటీలను నిర్వహిస్తాం. ఇక్కడ విజేతలుగా నిలిచిన ప్లేయర్స్‌ను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తాం.
– కొన్న మధుసూదనరావు,
అథ్లెటిక్స్ అసోసియేషన్ ఏపీ రాష్ట్ర, జిల్లా అధ్యక్షుడు


