నరసన్నపేట: జాతీయ రహదారి సర్వీసు రోడ్డుపై వై జంక్షన్ వద్ద సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. స్థానిక కొత్తవీధిలో నివసిస్తున్న కొనపల రాజశేఖర్ ఈ జంక్షన్ వద్ద ఆటో మొబైల్ షాపు నిర్వహిస్తున్నారు. కస్టమర్‌కి అవసరమైన వస్తువులు ఇచ్చి ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తుండగా.. పాతపట్నం ఎల్‌హెచ్ ఆర్టీసీ బస్సు నరసన్నపేట టౌన్‌లోకి వస్తూ ఢీకొంది. ఈ ప్రమాదంలో రాజశేఖర్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. నరసన్నపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నరసన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం, శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
ఎస్పీ గ్రీవెన్సుకు 70 ఫిర్యాదులు
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార వేదిక (గ్రీవెన్సు)లో ప్రజల నుంచి 70 ఫిర్యాదులు అందాయి. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి సకాలంలో న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.
భర్తకు భార్య తలకొరివి
సోంపేట: మండలంలోని ఎర్రముక్కాం గ్రామానికి చెందిన పారిశుద్ధ్య కార్మికుడు బైపల్లి యాదవరావు (60) సోమవారం ఉదయం అకస్మాత్తుగా మృతి చెందాడు. అతని కుమారుడు కాళీప్రసాద్ కొద్ది నెలల క్రితం బతుకుతెరువు కోసం దుబాయి వెళ్లాడు. దీంతో భార్య తులసమ్మ మానసికస్థితి బాగోలేకున్నా భర్తకు తలకొరివి పెట్టి అంత్యక్రియలు నిర్వహించింది.
మర్యాదపూర్వక భేటీ
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా మూడేళ్లకు పైగా పనిచేసిన జూనైద్ అహ్మద్ మౌలానాకు రాజమండ్రి జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయిన సందర్భంగా ఆయనను జిల్లా బార్ న్యాయవాదులు సోమవారం కలిశారు. ఈ సందర్భంగా మూడేళ్లలో ఆయన చేసిన సేవలపై మాట్లాడారు. ఆయనకు వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో న్యాయవాదులు వాన కృష్ణచంద్, పొన్నాడ వెంకటరమణారావు, ఎన్ని సూర్యారావు, తంగి శివప్రసాదరావు, ఇప్పిలి తాత, ఆగూరు ఉమామహేశ్వరరావు, కొమ్ము రమణమూర్తి, మామిడి క్రాంతి, కూన అన్నంనాయుడు, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


