నరసన్నపేట/పోలాకి: స్థానిక బైపాస్ సర్వీసు రోడ్డుపై శ్రీకాకుళం నుంచి జమ్ము వైపునకు వెళ్లే మార్గంలో సోమవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో పోలాకి మండలం బెలమర పోలవలసకు చెందిన గేదెల శ్రీకాంత్ (28) అక్కడికక్కడే మృతి చెందాడు. ఆస్పత్రి పనిపై శ్రీకాకుళం వెళ్లి ప్రియాగ్రహారం గ్రామానికి చెందిన స్నేహితుడు తుంగాన సురేష్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై వస్తుండగా డివైడర్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. దీంతో వాహనం వెనుక కూర్చున్న శ్రీకాంత్ ఎగిరి డివైడర్‌పై పడగా తలకు తీవ్రగాయమైంది. అధిక రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగిన చోట ఇసుక ఉండడంతో ద్విచక్ర వాహనం స్కిడ్ అయ్యి ఉండవచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. కాగా శ్రీకాంత్‌కు శ్రీకాకుళం వద్ద మొపసుబందర్‌కు చెందిన యువతితో గత నెల 21వ తేదీన వివాహం జరిగింది. కాళ్ల పారాణి ఆరక ముందే తన భర్త ఇలా మృతి చెందడంతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. అందివచ్చిన కుమారుడు ఇలా దుర్మరణం చెందడంతో తల్లిదండ్రులు ఆనంద్, విజయలక్ష్మి రోదనలు చూపరులకు కన్నీరు తెప్పిస్తున్నాయి. గ్రామంలోనే కేబుల్ ఆపరేటర్‌గా శ్రీకాంత్ పనిచేస్తున్నాడు. ప్రమాదంపై నరసన్నపేట ఎస్‌ఐ బి.గణేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాహనం నడుపుతున్న సురేష్‌తో మాట్లాడి ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు. కాగా మృతుని మెడలో ఉన్న బంగారు గొలుసు, చేతికి ఉన్న ఉంగరం కనిపించడం లేదు. ఈ బంగారు ఆభరణాలు ఏమై ఉంటాయోనని పోలీసులు ఆరా తీస్తున్నారు.


