● బస్తా యూరియా కోసం రైతుల అగచాట్లు
● ప్రభుత్వ విధానాలపై విస్తుపోతున్న అన్నదాతలు
టెక్కలి: ఒక బస్తా యూరియా కోసం రైతులు అదనపు శ్రమ పడుతున్నారు. గురువారం టెక్కలి పీఏసీఎస్ కార్యాలయం వద్ద యూరియా పంపిణీ చేపట్టారు. అయితే టెక్కలి మండలం మేఘవరం పంచాయతీతో పాటు తిర్లంగి పంచాయతీ గంగాధరపేట గ్రామానికి చెందిన రైతులకూ ఇక్కడే పంపిణీ చేశారు. గతంలో ఆయా గ్రామాల రైతుల చెంతకు యూరియా పంపిణీ జరిగేది. మేఘవరం పంచాయతీ పరిధి మేఘవరం, బొరిగిపేటతో పాటు గిరిజన గ్రామాలు భీంపురం, చిన్నభీంపురం, జీడిపేట, జక్కరపేట, కోదండపురం, సరియాపల్లి, డెప్పూరు తదితర గ్రామాల నుంచి ఇరువైపులా సుమారు 18 కిలోమీటర్ల మేరకు ఆటోలపై రైతులు ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ ప్రయాణానికి కనీ సం రూ.180 అయినా ఖర్చు పెట్టాలి. ఇది రైతుకు అదనపు ఖర్చు. పీఏసీఎస్ కార్యాలయం వద్ద యాప్‌లో నమోదు చేసిన తర్వాత మరి కొద్ది దూరంలో గల గోపీనాథపురం వద్ద గోడౌన్ వద్దకు వెళితే తప్ప యూరియా దక్కని పరిస్థితులతో రైతు లు అవస్థలకు గురవుతున్నారు.ఒక్క యూరియా బస్తా కోసం ఎక్కడో మారుమూల గ్రామం నుంచి మండల కేంద్రాల్లో పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఏర్పడిందంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు.
ఇబ్బంది పడుతున్నాం
మాది మేఘవరం పంచాయతీ భీంపురం గ్రామం. యూరియా కోసం టెక్కలి రావాలని చెప్పారు. మా గ్రామం నుంచి ఆటోలో ఉదయం 8 గంటలకు టెక్కలి వచ్చాం. మధ్యాహ్నం వరకు పడిగాపులు కాస్తున్నాం. ఇంతకు ముందు మా పంచాయతీకే యూరియా ఇచ్చేవారు. ఈ పరిస్థితి గందరగోళంగా ఉంది.
– జె.సూర్యనారాయణ, రైతు, భీంపురం, టెక్కలి మండలం.
ఉదయం నుంచి పడిగాపులు
కాస్తున్నాం...
యూరియా కోసం ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్నాం. మా ఊరి నుంచి అంద రం ఆటోలో వచ్చాం. యూరియా ఎప్పుడిస్తారో, మేమంతా ఎప్పుడు ఇంటి వెళతామో తెలియదు.
– జె.పెంటమ్మ, రైతు, భీంపురం
50 సెంట్లు భూమికి యూరియా లేదన్నారు
నా భార్య సుజాత పేరు మీద 50 సెంట్లు భూమి ఉంది. గత రెండు రోజుల కిందట మేఘవరం పంచాయతీ కేంద్రానికి వెళ్లి యూరియా కోసం వాకబు చేస్తే 50 సెంట్లు భూమికి యూరియా ఇవ్వమని చెప్పారు. నా పేరు మీద ఉన్న 75 సెంట్లు భూమికి యూరియా కోసం వచ్చాను. తెల్లవారి నుంచి పడిగాపులు కాస్తున్నాను. ఇదేం విధానమో అర్థం కావడం లేదు.
– డి.అప్పారావు, రైతు, బొరిగిపేట, టెక్కలి మండలం


