మనసు నిండా ఒంటరితనం. ప్రపంచంలో తమకెవరూ లేరన్న బాధ.. కుటుంబంలో ముగ్గురు ఉన్నా.. అందరం అనాథలమే అన్న భావన.. 62 ఏళ్ల వయసులో ఆ ఆలోచన ఆత్మహత్యకు ప్రేరేపించింది. ఆమెతో పాటు ఇద్దరు కూతుళ్ల ప్రాణాలను బలి కోరింది. వారి మృతదేహాల వద్ద నాలుగు కన్నీటి చుక్కలు రాల్చే వారు లేకపోవడం ఇంకా విషాదం అనిపించింది. జలుమూరు మండలం మర్రివలసకు చెందిన ముద్ద దాలప్పమ్మ (62), తన ఇద్దరు కుమార్తెలు దాలమ్మ(45), సరస్వతి (32) గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఏడాది కిందట దాలప్పమ్మ భర్త చనిపోయిన నాటి నుంచి ఈ కుటుంబం మానసికంగా ఆందోళనలో ఉంది. దాలప్పమ్మకు మరో ఇద్దరు కూతుళ్లు ఉన్నా.. వారు దూరంగానే ఉన్నారు. గురువారం రాత్రి ఇంటి లో తల్లీకూతుళ్లు గడ్డి మందు తాగేశారు. శుక్రవారం ఉదయం ఇరుగుపొరుగు వారు గమనించే సరికి దాలప్పమ్మ కొన ఊపిరితో ఉన్నారు. 108 వచ్చేలోపు ఆమె చనిపోయారు. దాలమ్మ, సరస్వతిలు రిమ్స్‌లో చికిత్స పొందు తూ మరణించారు. – జలుమూరు


