అచ్చెన్నాయుడి వ్యాఖ్యలకు నిరసనగా చేపట్టిన ర్యాలీలో ఉద్రిక్తం చింతాడ రవికుమార్ అరెస్ట్ ముందస్తుగా అనుమతి కోరినా నిరసన తెలిపేందుకు నిరాకరించిన పోలీసులు వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై లాఠీచార్జి పలువురికి గాయాలు
ఆమదాలవలస:
మహానేత వైఎస్సార్, ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై మంత్రి అచ్చెన్నాయుడు దిగజారుడు వ్యాఖ్యలను ఖండిస్తూ ఆమదాలవలస వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి చింతాడ రవికుమార్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఆమదాలవలసలో నిర్వహించిన కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నాలుగు మండలాల నుంచి భారీగా పార్టీ శ్రేణులు ఆమదాలవలస పార్టీ కార్యాలయానికి తరలివచ్చాయి. అయితే వారెవరూ అక్కడ నుంచి కదలడానికి వీల్లేదని ఆమదాలవలస సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో సుమారు 50 మందికి పైగా పోలీసుల బలగాలు, ఎస్‌ఐలు, అక్క డకు చేరుకొని అడ్డుకున్నారు. అచ్చెన్న దిష్టిబొమ్మ దహనం కోసం పార్టీ కార్యాలయం నుంచి బ్రిడ్జి డౌన్‌లో గల వైఎస్సార్ విగ్రహం వరకు ర్యాలీగా చేరుకునేందుకు పార్టీ క్యాడర్ కదిలింది. పోలీసులను రిక్వెస్టు చేసుకుంటూ చింతాడ రవికుమార్‌తోపాటు నాయకులు, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బొడ్డేపల్లి రమేష్‌కుమార్ తదితరులు ముందుకు సాగారు. ఈ నేపథ్యంలోనే విగ్రహం వద్దకు చేరుకునే సమ యంలో పోలీసులు లాఠీచార్జి మొదలుపెట్టారు. దీంతో పొందూరు మండలానికి చెందిన పార్టీ జిల్లా చేనేత విభాగం అధ్యక్షుడు సత్యనారాయణకు వీపుపై లాఠీ దెబ్బలు తగిలాయి. అలాగే ఆమదాలవలస మున్సిపాలిటీ బొడ్డేపల్లి పేటకు చెందిన సింగూరు రమేష్‌కు చేతిపైన, చేతి వేళ్లపైన లాఠీలు దెబ్బలు తగిలి గాయాలయ్యాయి. బొడ్డేపల్లి రమణమూర్తికి కాలిపైన దెబ్బలు తగిలాయి. వీరితోపాటు మరికొంతమందికి పలు చోట్ల గాయాలయ్యాయి.


